calender_icon.png 16 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

71వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా

16-01-2025 01:10:38 AM

 మెదక్ జిల్లాలో ఈనెల 26 నుండి అమలు  గ్రామసభల ద్వారా అర్హుల ఎంపిక

పాపన్నపేట, జనవరి 15ః  భూమిలేని నిరుపేదలకు సైతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనీసం ఒక ఆర్ధిక సంవత్సరంలో 20 రోజులు పని చేసిన వారిని అర్హులుగా నిర్ణయించారు.

ఇందులో భాగంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ కమీషనర్ కార్యాలయం నుండి ప్రత్యేకంగా జిల్లాలకు 20 రోజులు అంతకంటే ఎక్కువ పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాల జాబితాలను పంపడం జరిగింది. ఇందులో ఆధార్ నంబరు లేని కూలీలకు 16 లోగా ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి.

జిల్లాలో 71 వేల కుటుంబాల గుర్తింపు..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్న భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం వర్తించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భూమి లేని నిరుపేదలకు రెండు విడతలుగా ఏడాదికి 12 వేల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఇందుకుగాను జిల్లాలో ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ఆర్ధిక సంవత్సరంలో కనీసం 20 రోజులు అంతకన్నా ఎక్కువ పని దినాలను పూర్తి చేసిన 71,686 కుటుంబాలను గుర్తించడం జరిగింది.

గుర్తించిన కుటుంబాలలో ఆధార్ అనుసంధానం లేని సుమారు 23,112 మందికి సంబంధించిన ఆధార్ నమోదును 15లోగా పూర్తి చేయాలనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఆదేశాలతో రెండు రోజుల్లో వంద శాతం ఆధార్ నమోదును పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించారు.

గ్రామసభల ద్వారా అర్హుల ఎంపిక..

ప్రభుత్వానికి చేరిన డేటా ఆధారంగా గ్రామాల వారీగా జాబితాను మండల పరిషత్ అధికారులకు పంపనున్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు గ్రామాల వారిగా భూమి లేని నిరుపేదలను గుర్తించి ఖచ్చితమైన సమాచారాన్ని ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ఇందుకు గాను ప్రత్యేక గ్రామసభలను నిర్వహించి నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జనవరి 26 న ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయనుండడంతో ఆలోపే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయనున్నారు.

వందశాతం ఆధార్ నమోదు పూర్తి చేశాం

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం కింద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 20 రోజుల కంటే ఎక్కువ పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు జిల్లాలో 71వేలకు పైగా ఉన్నాయి. వాటిలో 23 వేల మందికి జాబ్ కార్డుతో ఆధార్ అనుసంధానం లేకపోవడంతో రెండు రోజులుగా మా ఉపాధి హామీ సిబ్బంది పగలు, రాత్రి తేడా లేకుండా అర్హుల వద్ద నుండి ఆధార్ సమాచారాన్ని సేకరించి విజయవంతంగా అనుసంధానం చేశాం. నమోదు చేసిన వివరాలను ప్రభుత్వానికి పంపించడం జరిగింది.

 సిహెచ్.శ్రీనివాసరావు, డీఆర్డీఏ, మెదక్