calender_icon.png 18 March, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీనే

18-03-2025 12:48:59 AM

  • ప్రజలు ప్రశ్నిస్తే జర్నలిస్టులను జైలుకు పంపుతారా...? 

చంచల్‌గూడ జైల్లో జర్నలిస్టులు రేవతి, తన్వియాదవ్‌లకు కేటీఆర్ పరామర్శ 

హామీలను అమలు చేసేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం..

మలక్‌పేట, మార్చి 17 (విజయక్రాంతి):  అక్రమ కేసులతో  ఆడబిడ్డలను  జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులే అన్న సంగతి మరోసారి స్పష్టం అయిందన్నారు. రేవంత్ అనే పిచ్చోడి చేతిలోని రాయిలెక్క తెలంగాణ మారిందని విమర్శించారు.

420 బూటకపు హామీలతో  కాంగ్రెస్ గద్దెనెక్కిందన్న కోపంతో ముఖ్యమంత్రికి అర్థం కావడానికి ఆయన మాట్లాడే బజారు భాషలోనే జనం నిలదీస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో చంచల్ గూడ జైల్లో ఉన్న జర్నలిస్టులు రేవతి, తన్వియాదవ్‌లను బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులతో కలిసి కేటీఆర్ పరామ ర్శించారు. రేవతి, తన్వియాదవ్‌కు ధైర్యం చెప్పారు. జర్నలిస్టుల కుటుంబసభ్యులను కేటీఆర్ ఓదార్చారు. రేవతి, తన్వి యాదవ్ తరపున న్యాయపోరాటం చేస్తామని హామి ఇచ్చారు. 

మొహబ్బత్ కీ దుకాన్ అంటే జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపడమేనా?

రేవతి, తన్వియాదవ్ ను పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రేవంత్ మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తున్నందుకే జర్నలిస్టులపై ముఖ్యమంత్రి అక్కసు వెళ్ళగక్కుతున్నారని మండి పడ్డారు. జనం నిలదీస్తే ..ప్రజలు ప్రశ్నిస్తే జర్నలిస్టులపై ఉక్కు పాదం మోపుతారా? జైలుకు పంపుతారా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తున్న డిజిటల్ జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులతో వేధించడం ప్రజాస్వా మ్య హననమే అన్నారు. ఒకరిద్దరు జర్నలిస్టులపైనే కాదు పదుల సంఖ్యలో జర్నలి స్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. తాను ఎంతో గొప్పగా చెప్పిన మొహబ్బత్ కి దుకాన్ అంటే ఇదేనో కాదో చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులను బట్టలు ఊడదీసి కొడ్తానని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. ప్రజల ఆక్రోశాన్ని చూపించడమే రేవతి, తన్వి యాదవ్ చేసిన తప్పా? అని ప్రశ్నించిన కేటీఆర్, రేవంత్ నియంతృత్వ పోకడలను అడ్డుకోకుండే రేపు మిగతా జర్నలిస్టులకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అక్రమాలపై మీడియా గొంతు విప్పి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. 

కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే అదేదో సంక్షేమ రాజ్యం అని ప్రజలు భ్రమపడ్డారని కేటీఆర్ చెప్పారు. కెసిఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అపోహ పడ్డారని తెలిపారు.

6 గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యమని పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి, ప్రజలు గొంతు విప్పితే మాత్రం తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని  ప్రజలు అంతా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారని చెప్పారు. 

మాకు కుటుంబాలు ఉన్న సంగతి నీకు గుర్తులేదా? 

జైల్లో పెడతామంటే భయపడడానికి బీఆర్‌ఎస్‌లో ఎవరూ లేరన్న కేటీఆర్, తామంతా ఉద్యమాల నుంచి వచ్చామన్నారు. ప్రభుత్వ బెదిరింపులు, అక్రమకేసులకు భయపడే వాళ్ళంకాదని స్పష్టం చేశారు. అధికారమందంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డికి రేపు కచ్చితంగా తగిన శాస్తి జరుగుతుందన్నారు.

ఆయనకు వంతపడే వాళ్లకు కూడా సేమ్ టూ సేమ్ జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. 

తెలంగాణ రైజింగ్ కాదు.. తెలంగాణ ఈజ్ ఫాలింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 71 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్న రేవంత్ రెడ్డి, అన్ని రంగాల్లో తెలంగాణ విఫలమైన సంగతినిస్వయంగా ఒప్పుకున్నారని కేటీఆర్ చెప్పారు. రేవంత్ అస మర్థ విధానాల వల్లనే ఆదాయం తగ్గిందన్నారు.

కాంగ్రెస్ వచ్చినంక తెలంగాణ లో అన్ని రంగాలు చాలా బాగున్నాయి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి, 71 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గిందో ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ ఈజ్ ఫాలింగ్ అన్న చేదు నిజాన్ని ముఖ్యమంత్రి కన్ఫర్మ్ చేశారన్నారు. పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో రాయిల తెలంగాణ మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జర్నలిస్టులు రేవతి,తన్వియాదవ్‌కు బెయిల్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17(విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న  జర్నలిస్టులు రేవ తి, తన్వియాదవ్‌కు నాంపల్లి కోర్టు బెయి ల్ మంజూరు చేసింది.

రూ.25వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు  చేసిన కోర్టు ప్రతీ సోమ, మంగళవారం విచారణకు హాజరు కావాలని కోర్టు వారిని ఆదేశించింది. నిప్పుకోడి అనే ఎక్స్‌ఖాతాలో సీఎంను తిడుతున్న వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా సెల్ రాష్ట్ర కార్యదర్శి కైలాష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.