రూ.220 కోట్లతో ‘అమృత్ పథకం’ పనులు
రూ.250 కోట్లతో వరద ముంపు నివారణ పనులు
ప్రత్యేక ప్రణాళికతో ఖమ్మం నగరాభివృద్ధి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 22 (విజయక్రాంతి): పేదలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఆదివారం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలసి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్ రమణగుట్టలో సిమెంట్ రోడ్డు, స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్దనే ఉన్నదని, ఖమ్మంలో అధికంగా ఇండ్లను కేటాయించాలని కోరినట్లు తెలిపారు.
నీటి సరఫరాకు రూ.220 కోట్లు
నగరానికి నీటి సరఫరా కోసం రూ.220 కోట్లతో అమృత్ పథకం కింద పనులు ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మంలో వరదల కారణంగా ముంపు రాకుండా ఉండేందుకు రూ.250 కోట్లు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభించి రాబోయే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నిపుణుల కమిటీచే అంచనాలు తయారు చేస్తున్నామని తెలిపారు.
డంపింగ్ యార్డ్ రోడ్డు విస్తరణ కోసం రూ.కోటి 15 లక్షలు మంజూరు చేశామని అన్నారు. స్లాటర్ హౌస్ నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరు చేశామని, 500 ఎకరాల్లో ఉన్న వెలుగు మట్ల అర్బన్ పార్కును నెహ్రూ జువాలాజికల్ పార్క్‌లా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఖమ్మం మ్మం అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వ భూములు అక్రమిస్తే చర్యలు
ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. రహదారుల వెంబడి ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరుగుతుంటే అరికట్టాలని, లేదంటే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పీ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్ ఎండీ రఫీదబేగం, కమర్తపు మురళి పాల్గొన్నారు.