12-03-2025 01:14:21 AM
వైరా, మార్చి 11 ( విజయక్రాంతి ): రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజక వర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ విజ్ఞప్తి మేరకు గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ నియోజక వర్గానికి కోటా కంటే ఎక్కువ ఇళ్లు ఇస్తానని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
వైరా నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అనంతరం పుణ్యపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులను ప్రతి నెలా రూ.6,500కోట్లు చొప్పున చెల్లిస్తూనే రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక అవసరాలను తీరుస్తున్నామన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాస్త ఆలస్యమైనా నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు రుణమాఫీతో పాటు దేశ చరిత్రలో ఒకే ఏడాదిలో 56వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. ఈ వారం చివరిలోగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ గ్రామాల్లోని అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
ఎవరూ అధైర్యపడొద్దని రాబోయే మూడు, నాలుగేళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, సూతగాని జైపాల్, గుమ్మా రోశయ్య, సీతారాములు, నర్సిరెడ్డి, గోసు మధు, వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.