హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్
ఖమ్మం, డిసెంబర్ 27 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న వారి అర్జీల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్, ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని మోతీనగర్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ ప్రజలు అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని సర్వే కోసం వచ్చే ఎన్యూమరేటర్లతో సహకరించాలని కోరారు. ప్రతీరోజు నిర్ధేశించుకున్న లక్ష్యం మేరకు ఎన్యూమరేటర్లు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు సర్వే పూర్తి చేయాలని, సర్వేను సకాలంలో పూర్తి చేసేందుకు అదనపు లాగిన్లు రూపొందించాలని ఎండీ సూచించారు. ఎండీ తనిఖీల సందర్భంగా డీఆర్డీవో సన్యాసయ్య, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో కుమార్ తదితరులు పాల్గొన్నారు.