19-03-2025 02:15:16 AM
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రం భీం ఆసిఫాబాద్,మార్చి 18(విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఈ నెల 31వ తేదీలోగా పునాది పనులు పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
మంగళవారం సిర్పూర్ (టి) మండలం మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రావణ పల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 31 వ తేదీలోగా పునాది స్థాయి పనులు పూర్తి చేసే విధంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలని తెలిపారు.
గ్రామంలోని ప్రజలకు మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధమైన త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎ. ఈ. ను ఆదేశించారు. వేసవికాలం దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా నిరంతరం త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రాహుల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.