calender_icon.png 10 January, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ దరఖాస్తుల పరిశీలన 95 శాతం పూర్తి

10-01-2025 01:48:50 AM

  1. గ్రేటర్ పరిధిలో 88 శాతం పూర్తయిన సర్వే 
  2. ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ 
  3. గ్రామాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదులు 
  4. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక 
  5. రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి కావస్తోంది. ఈ నెల 8 నాటికి హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో 95 శాతం సర్వే పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం 88 శాతం సర్వే జరిగింది. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, ఇండ్ల నిర్మాణానికి చేపట్టవలసిన కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పారదర్శకమైన సేవలను అందించేందుకు, ఫిర్యాదుల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం సచివాలంలో తన ఛాంబర్‌లో ‘ గ్రీవెన్స్ మాడ్యూల్ ’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అరులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్‌కు మెసేజ్ ద్వారా తెలియజేస్తామని వివరించారు. గ్రామాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు వెళ్తోందని చెప్పారు. 

మధ్యవర్తులకు తావులేదు

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, మధ్యవర్తులకు ఎలాంటి తావులేకుండా అర్హులైన వారికే ఇండ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు. త్వరలోనే ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని, రెండో దశలో ప్రభుత్వమే నివాస స్థలంతోపాటు ఇండ్లు నిర్మించి ఇస్తుందని వివరించారు. మొదటి విడతలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, సఫాయి కార్మికులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులే ఇండ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించాలని ఆదేశించారు. లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇండ్లు నిర్మించుకోవచ్చని స్పష్టంచేశారు.

చివరి లబ్ధిదారుడి వరకు ఇండ్లను మంజూరు చేసి, నిర్మించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఉద్ఘాటించారు. కామారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో -98 శాతం.. ములుగు, కరీంనగర్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో 97 శాతం..

మహబూబూబాద్, జగిత్యాల, సిద్దిపేట, కుమ్రంబీం ఆసిఫాబాద్, జనగాం, రంగారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాలలో- 96 శాతం పరిశీలన పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.