19-04-2025 09:31:15 PM
ఉపాధి హామీ కూలీలకు, సిబ్బందికి పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి..
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) డిమాండ్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి రూ 12వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మచ్చ వెంకటేశ్వర్లు అద్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారని ఇంతవరకు ఈ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్నారు.
2024 సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదన్నారు, ఉపాధి హామీ మస్టర్ల లింకు పెట్టి వ్యవసాయ కూలీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు, ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో భూమి లేని నిరుపేదల వివరాలన్నీ వచ్చాయని తెలిపారు, ఆ వివరాల ఆధారంగా వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు,పేదలకిచ్చే పథకాల అమలులో వ్యత్యాసం చూపిస్తున్నారని అన్నారు, జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... జిల్లాలో ఉపాధి హామీ పని చేసిన కూలీల వేతనాలు, సిబ్బంది వేతనాలు, ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, లేకపోతే సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య ,బి.చిరంజీవి, బత్తుల వెంకటేశ్వర్లు, శెట్టి వినోద,మర్మం చంద్రయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు ముదిగొండ రాంబాబు, గడ్డం స్వామి,ఆలేటి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.