29-03-2025 12:15:10 AM
బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు చెల్లింపులు హౌసింగ్ ఎండి వీ.పీ గౌతమ్
మెదక్, మార్చి 28(విజయక్రాంతి)ఃమెదక్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఎండి విపి గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, హౌసింగ్ పి.డి మాణిక్యం, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఈ. ఈ పి ఆర్ నరసింహులు, ఎల్ డి ఎం నరసింహమూర్తి, ,సంబంధిత ఎంపీడీవోలతో హౌసింగ్ ఎండి వీ.పీ గౌతమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో అధికారుల నుంచి జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి అన్ని వివరాలను పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకొన్నారు. అనంతరం హౌసింగ్ ఎండి వి.పి గౌతమ్ మాట్లాడుతూ దారిద్య రేఖకు దిగువన ఉన్నవారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్స్ నుండి 500 స్క్వేర్ ఫీట్స్ వరకు ఇండ్లు నిర్మించుకోవచ్చని తెలిపారు.
గ్రామాలలో మేస్త్రీల ఇంటి నిర్మాణం, మెటీరియల్ తదితర విషయాల్లో సంబంధిత ఎంపీడీవోలు సలహాలు సూచనలు పాటించాలన్నారు. మెదక్ జిల్లాలో 1242 ఇండ్లు మంజూరు కాగా వివిధ దశలలో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల ప్రక్రియ ఏమాత్రం పెండింగ్ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వెల్దుర్తి మండలం ధర్మారం క్షేత్రస్థాయి సందర్శన చేయడం జరిగిందని ఇందిర ఇండ్ల నిర్మాణ పురోగతిలో కొన్ని అంశాలను పరిశీలించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం నాలుగు విడతలుగా చెల్లింపులు చేస్తుందని, మొదటి విడతగా బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు లక్ష రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
ఉగాది పండుగ అనంతరం మొదటి విడత నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియను పరిశీలించడం జరుగుతుందని , ఎంపీడీవోలతో సమావేశాలు నిర్వహించుకుని ఇందిరమ్మండ్ల నిర్మాణ ప్రక్రియ పురోగతి పై చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీడీ వోలు సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.