calender_icon.png 25 April, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగడుగునా అడ్డంకులే...

25-04-2025 02:40:13 AM

పునాదుల్లోనే ఇందిరమ్మ మాడల్ హౌస్ నిర్మాణాలు 

మంజూరైనవి 18, పూర్తయినవి 3

మహబూబాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిలువ నీడలేని నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ గృహాల పథకం లో భాగంగా.. ప్రతి మండలంలో ఒక ‘మోడల్ ఇందిరమ్మ గృహాన్ని’ నిర్మించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో 5 లక్షల వ్యయంతో 18 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించేందుకు నిర్ణయించి, నాలుగు నెలల క్రితం పనులకు శ్రీకారం చుట్టారు. అయితే కేవలం డోర్నకల్, మరిపెడ, మహబూబాబాద్ మండలాల్లో మాత్రమే ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలు పూర్తి చేశారు. కురవి, శిరోలు, ఇనుగుర్తి, పెద్దవంగర, గంగారం సహా ఎనిమిది మండలాల్లో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించకపోవడంతో ఇప్పటికి చేపట్టలేదు.

ఇక నిర్మాణం చేపట్టిన నెల్లికుదురు, కేసముద్రం, నరసింహుల పేట తో పాటు ఏడు మండలాల్లో మోడల్ హౌస్ నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. గ్రామాల్లో స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, ఫీల్ వెరిఫికేషన్ జరుగుతోంది. ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికి మంజూరు ఇచ్చి నిర్మాణాలు ప్రారంభించడానికి ఓవైపు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఆయా మండలాల్లో నిర్మించిన ‘మోడల్ హౌస్’ ప్రత్యక్షంగా చూపించి ఆ తరహాలో కొత్త ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునే విధంగా ప్రోత్సహించాల్సి ఉంటుంది.

అయితే జిల్లావ్యాప్తంగా కేవలం మూడు మండలాల్లోనే మోడల్ హౌస్ నిర్మాణాలు పూర్తికాగా మిగిలిన మండలాల్లో పూర్తి కాకపోవడం, ఏకంగా ఎనిమిది మండలాల్లో నిర్మాణాలకి అవసరమైన స్థలం లేకపోవడంతో లబ్ధిదారులకు ఇండ్లు కట్టుకునే విధంగా ప్రత్యక్షంగా చూపించే అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి అసంపూర్తిగా ఉన్న మండలాల్లో నిర్మాణాలు పూర్తి చేయడం, స్థలం లేక నిర్మించలేకపోయిన మండలాల్లో వెంటనే స్థలం కేటాయించి యుద్ధ ప్రాతిపదికన మోడల్ హౌస్ నిర్మిస్తే పేద ప్రజలు మోడల్ హౌస్ ను ఆధారంగా చేసుకుని ఆ విధంగా ఇండ్లు నిర్మించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

త్వరలో పూర్తి చేస్తాం..

మండల కేంద్రాల్లో చేపట్టిన మోడల్ హౌస్ నిర్మాణాలను త్వరలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. నర్సింహులపేటతో పాటు మరికొన్ని మండలాల్లో ఇసుక లభించడం లేదు. ఇంకొన్ని చోట్ల ఇతర సమస్యలున్నాయి. 8 మండలాల్లో మోడల్ హౌస్ నిర్మాణానికి అవసరమైన స్థలం లేక నిర్మాణాలు చేపట్టలేకపోయాం. కేస ముద్రం, నెల్లికుదురు మండలాల్లో స్లాబ్ రెండు రోజుల్లో వేయిస్తాం. సాధ్యమైనం తవరకు ప్రతి మండలంలో మోడల్ హౌస్ నిర్మాణానికి కృషి చేస్తాం. 

 -రాజయ్య, డీఈ, గృహ నిర్మాణ శాఖ