calender_icon.png 2 November, 2024 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి

11-05-2024 01:34:13 AM

ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలి 

మంత్రి కొండా సురేఖ

సిద్దిపేట/ సిద్దిపేట రూరల్ , మే 10 (విజయక్రాంతి): దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గంలోని ఎన్సాన్‌పల్లి, పుల్లూరు, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు గ్రామాల్లో నిర్వహిం చిన కార్నర్ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. బీజేపీకి ఓటేస్తే దేశ ప్రజలంతా బానిసలుగా బతికే రోజులు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ప్రజలకు ఏం మేలు జరగలేదని, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే లాభపడ్డారని తెలిపారు.

బీఆర్‌ఎస్ పాలనలో చేసిన పాపాలకు ప్రతిఫలమే కవితకు జైలు శిక్ష అని, కేసీఆర్ పోరాడేది జైలు నుంచి బిడ్డను విడిపించుకునేందుకే అని పేర్కొన్నారు. మంత్రి గా హరీశ్‌రావు కోట్లు దండుకున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రైతులపై అక్రమ కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించిన చరిత్ర ప్రజలు మరిచిపోలేదని అన్నారు.

దుబ్బాకకు ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ఏం చేయలేకపోయారని, మెదక్ ఎంపీగా గెలిస్తే ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ పూజల హరికృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.