calender_icon.png 27 January, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం: మంత్రి దామోదర రాజనర్సింహ

26-01-2025 05:47:03 PM

రాష్ట్రంలో నూతన పథకాల అమలు..

త్వరలో రూ.168 కోట్లతో సింగూరు పంట కాలువల సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభం..

ఆందోల్: ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) అన్నారు. ఆదివారం నాడు పుల్కల్ మండలం ఈసోజిపేట, అందోల్ మండలం నేరడి గుంట గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆదివారం నుండి ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలను జిల్లాలో లాంచనంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి(Collector Valluru Kranti)తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలలో మంత్రి మాట్లాడారు. ముందుగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశాలలో ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు ఆయా పథకాల మంజూరు పత్రాలను మంత్రి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఇసోజుపేట గ్రామంలో 123 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. 1992లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇసోజి పేటలో నిరుపేద కుటుంబాలకు 200 ఎకరాల భూమి పంపిణీ, నేరడిగుంటలో గతంలో 250 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.

త్వరలో 168 కోట్లతో సింగూరు ప్రాజెక్టు నుండి అందోల్ నియోజకవర్గంలోని పంట పొలాలకు నీరు అందించే పంట కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో విద్యా వైద్య కళాశాలలో ఏర్పాటుచేసి నీటి తరం విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల ఫలాలు చిట్టచివరి ప్రజలకు చేరేవరకు సంక్షేమ పథకాలు నిరంతరముగా కొనసాగుతాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి  వల్లూరు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని విడతలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు  అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో పూర్తిగా ఇండ్లు లేని ఖాళీ స్థలం ఉన్న నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డిఓ జ్యోతి, ఆందోల్ ఆర్డిఓ పాండు, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ చలపతిరావు, ప్రజాప్రతినిధులు  వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.