calender_icon.png 27 April, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే వేగవంతం చేయాలి

26-04-2025 09:06:29 PM

రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలి

ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణ పొడిగించిన ప్రక్రియను వేగవంతం చెయ్యాలి

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల మండలాల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ సంబంధిత అధికారులు, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.వీరబ్రహ్మచారిలతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను నేరవేరుస్తోందని పేర్కొన్నారు.

మోడల్ హౌస్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అలాగే బేస్మెంట్ కట్టడం పూర్తైన వాటికి సంబంధించి ఇంటి బేస్మెంట్ చిత్రాలను తీసి యాప్ లో నమోదు చేయాలని, తదుపరి నిర్మాణానికి రూ.లక్ష చొప్పున మంజూరు చేయాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో సర్వే సందర్భంగా పక్కా సమాచారం సేకరించాలని, అర్హులైన లబ్ధిదారులు లిస్ట్ సిద్ధం చేయాలని సూచించారు. వెరిఫికేషన్ ఫామ్ లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా పక్కా సమాచారం వ్రాయాలన్నారు. ఇందిరమ్మ కమిటీ ప్రకారం కేటాయించిన జాబితా కచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వేను ప్రత్యేక అధికారులు సూపర్వైజ్ చెయ్యాలని, ప్రతీ రోజూ నివేదికలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా దరఖాస్తులను  పరిశీలించి, యూనిట్స్ ప్రకారం వేరు వేరు గా సిద్ధం చేయాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణ పొడిగించిన ప్రక్రియను వేగవంతం చేయాలనీ, ఫీజు చెల్లించిన వారికి ప్రోసిడింగ్ కాపీలు మంజూరు చేయాలని, మిగిలిన వారికి స్వయంగా ఫోన్, చేసి పొడిగించిన ఎల్ఆర్ఎస్ పథకం సబ్సిడీని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, గృహ నిర్మాణ పీడీ రాజయ్య, డీఆర్డిఓ పిడి మధుసూదన్ రాజు, డీసీఓ వెంకటేశ్వర్లు, బిసి వెల్ఫేర్ అధికారి నరసింహస్వామి, మండలాల ప్రత్యేక్య అధికారులు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.