calender_icon.png 17 November, 2024 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెక్స్‌టైల్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు

17-11-2024 12:43:40 AM

  1. 863 ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయం
  2. ఉత్తర్వులు జారీ చేసిన రోడ్లు, భవనాల శాఖ

హైదరాబాద్, నవంబర్ 16 (విజయ క్రాంతి) : వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు సంబంధించి భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగానే వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈమేరకు శనివారం రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధాప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ రిజర్వ్ కోటా కింద చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భూనిర్వాసితులకు 863 ఇళ్లను మంజూరు చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన భూనిర్వాసితులకు ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేస్తుంది. ఈ మొత్తంతో వారు సొంతిళ్లను నిర్మించుకోనున్నారు. 

గత ప్రభుత్వం సంకల్పించినా..

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికోసం 2016లో వరంగల్ జిల్లా సంగెం, శాయంపేట మండలాల చుట్టుపక్కల గ్రామాల నుంచి దశల వారీగా దాదాపు 1,357 ఎకరాలను సేకరించింది. ఏళ్లు గడిచినా టెక్స్‌టైల్ పార్కు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు.

గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినట్టు భూనిర్వాతులు తెలిపారు. ఈ నేపథ్యంలో భూములిచ్చి తాము రోడ్డున పడ్డామని, తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. టెక్స్‌టైల్ పార్కు నిర్వాసితులను ఆదుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.