calender_icon.png 22 December, 2024 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు

07-08-2024 01:05:54 AM

  1. హుజూర్‌నగర్‌లో 2,160 ఇళ్లు 3 నెలల్లో పంపిణీ 
  2. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు అభూత కల్పన 
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, ఆగస్టు 6(విజయక్రాంతి): రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూ ర్‌నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద హౌజింగ్ కాలనీని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదేండ్ల పాటు హౌజింగ్ రంగాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం కేసీఆర్ సృష్టించిన ఓ అభూత కల్పనేయని విమర్శించారు.

హుజూర్‌నగర్ పట్టణంలో 2013-14 సంవత్సరంలో తాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2,160 యూనిట్లతో ఇందిరమ్మ ఇండ్ల ప్రాజెక్టును ప్రారంభిస్తే బీఆర్ ఎస్ వాటిని పక్కన పెట్టిందన్నారు. రానున్న మూడు నెలల్లో అన్ని పనులు పూర్తి చేసి నిరాశ్రయులకు అందజేస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గృహనిర్మాణ పథకానికి రూ.7,740 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం పట్టణంలో ఐటీఐ కళాశాల, ఏటీసీ సెంటర్ వర్క్‌షాప్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

క్రిస్టియన్ స్మశా నవాటిక, టౌన్‌హాల్, 100 పడకల దవాఖా న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. స్టేడియం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, ఎన్‌జీఓ కాలనీలో టీయూఎప్ ఐడీసీ పనులకు శంకుస్థాపన చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో 325 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.