05-03-2025 12:48:20 AM
సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి జగన్
ఇబ్రహీంపట్నం, మార్చి 4 (విజయ క్రాంతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి.జగన్ అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో ప్రజా సమస్యలపై సీపీఎం సర్వే నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చిందన్నారు.
ఇల్లులేని పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదన్నారు. ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా పారదర్శకంగా గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక చేయాలన్నారు. ఎంతోమంది పేదలు ఇరుకు గదుల్లో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.
వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేసవిలో త్రాగునీటి కొరత రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రజా సమస్యలపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వర కు సర్వేలు చేసి వచ్చిన సమస్యల పరిష్కారానికి ఆందోళనలు నిర్వహించాలని పిలుపుని చ్చిందన్నారు. మార్చి 27న కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే మహాధర్నాలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాయపోల్ మాజీ ఎంపి టిసి నీరుడు బిక్షపతి, నాయకులు పెర్క యాదయ్య, అచ్చన రాములు పాల్గొన్నారు.