09-04-2025 01:32:17 AM
హౌసింగ్ అధికారులను ఆదేశించిన మెదక్ కలెక్టర్
రామాయంపేట, ఏప్రిల్ : క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట పరిధిలో దామరచెరువు గ్రామంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. అనంతరం రామాయంపేటలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసిన కలెక్టర్, రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల , మోడల్ ఇంటి నిర్మాణ పనులపై ఆరా తీశారు.
ఇంటి లోపల డిజైన్, సౌకర్యాలపై అధికారులకు, సిబ్బందికి కీలక సూచనలు చేశారు. పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రామాయంపేటలో రాజీవ్ యువ వికాసం పథకం హెల్ప్ డెస్క్ ను కలెక్టర్ సందర్శించారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, హౌసింగ్ అధికారులు, సంబంధిత రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.