calender_icon.png 3 April, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక ఇబ్బందే!

13-12-2024 12:21:26 AM

కేటాయింపులు కొంచెం.. దరఖాస్తులు ఘనం

  1. ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మాత్రమే నిర్మాణం
  2. వేలల్లో ఆశావహులు.. సవాలుగా మారిన ఎంపిక ప్రక్రియ
  3. గ్రామాల్లో తలలు పట్టుకుంటున్న జీపీ సెక్రటరీలు, సర్వే సిబ్బంది

నిర్మల్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని మొత్తం 116 నియోజకవర్గాల్లో తొలి విడత గా, ఒక్కో నియోజకవర్గంలో 3,500 చొప్పు న ఇండ్లు నిర్మిస్తామని చెప్పింది.

తద్వారా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4,06,000 ఇండ్లు నిర్మించాలని టార్గెట్ నిర్దేశించుకున్నది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నది. దీనిలో భాగంగా నిర్మల్ జిల్లాలో గురువారం సర్వే ప్రారంభమైంది.

జిల్లా నుంచి 1,92,333 దరఖాస్తులు రాగా, వాటిపై యాంత్రాంగం క్షేత్రస్థాయికి వెళ్లి విచారిస్తున్నారు. అర్హుల ఎంపిక కత్తిమీద సాము అవుతోందని సర్వే అధికారులు వాపోతున్నట్లు తెలిసింది. ఒక్క నియోజకవర్గం నుంచి వేలాల్లో దరఖాస్తులు ఉంటాయని, అర్హులు కూడా అంతకు కొంచెం తక్కువగా ఉంటారని వాపోతున్నారు.

సర్వే ఇలా...

నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న 400 పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరిగింది. సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి, దరఖాస్తుదారుల ఇంటికి వెళ్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరించి.. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తున్నారు. సర్వేను కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.

సర్వే సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబ యజమాని పేరు, రేషన్‌కార్డు వివరాలు తెలుసుకుంటున్నారు. దరఖాస్తుదారుకు ఉన్న స్థలం సొంతమా, ప్రభుత్వ స్థలమా,  ఎన్ని సంవత్పరాల నుం చి ఆ కుటుంబం గ్రామంలో ఉంటుంది, గతంలో ఆ కుటుంబం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందిందా.. అన్న వివరాలపై క్షుణ్నంగా విచారిస్తున్నారు. దివ్యా గుంలు, ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు.

వచ్చిన దరఖాస్తుల వివరాలు..

భైంసా నుంచి 12,711 దరఖాస్తులు, నిర్మ ల్ నుంచి 19,223, ఖానాపూర్ నుంచి 4, 130, బాసర నుంచి 5,668, భైంసా నుంచి 11,858, దస్తురాబాద్ నుంచి 4,937, దిలువార్‌పూర్ నుంచి 5,857,  కడెం నుంచి 11, 178, ఖానాపూర్ నుంచి 8,404, కుబీర్ నుంచి 15,062, కుంటాల నుంచి 6,557, లక్ష్మణచాంద నుంచి 7,893, లోకేశ్వరం నుంచి 9,138, మామాడ నుంచి 9,629, ముదోల్ నుంచి 9,374, నర్సాపూర్ నుంచి 6,564, నిర్మల్ రూరల్ నుంచి 7,331, పెంబి నుంచి 4,460, సారంగపూర్ నుంచి 13,039, సోన్ నుంచి 6,723, తానూర్ నుంచి 12,432 దరఖాస్తులు వచ్చాయి.

మూడు నియోజకవర్గాల్లో..

జిల్లాలో మొత్తం మూడు నియోజకవర్గాలు ఉండగా,  నిర్మల్ నియోజకవర్గంలో 154 పంచాయతీలు, ముదోల్ నియోజకవర్గంలో 162 పంచాయతీలు, ఖానాపూర్ నియోజకవర్గంలో 92 పంచాయతీలు ఉన్నా యి. ఇవి  కాగా నిర్మల్, భైంసా, ఖానాపూర్‌లో మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ప్రకా రం ప్రతి గ్రామానికి 10 ఇండ్లు మాత్రమే మంజూరయ్యే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు మున్సిపాలిటీల పరిధిలో 24 42 వార్డులు ఉండనే ఉన్నాయి. 

రాజకీయ ఒత్తిళ్లు..

ప్రతి నియోజకవర్గంలో కేవలం 3,500 ఇండ్లు మాత్రమే నిర్మిస్తుండగా, ఇండ్ల మంజూరుపై మున్ముందు రాజకీ య నేతల ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉం దని, పలుకుబడి ఉన్నవారు తమకే పథకం కేటాయించాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు సర్వే విధులు తాము చేయలేకపోతున్నామని, ఇతరశాఖలకు చెందిన ఉద్యోగులకు అప్పగించాలని తెగేసి చెప్తున్నట్లు తెలిసింది.

ఇప్పటికే గతంలో ఇందిరమ్మ ఇల్లు దక్కని వారు కాచుకుని ఉంటారని, వారికి కచ్చితంగా లబ్ధి చేకూర్చాల్సి ఉంటుందని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొందరు నేతలు తమ వర్గం వారికి లబ్ధి చేకూర్చాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది.