15-04-2025 08:31:15 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరుపేదలకు గూడు కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డిఓ లోకేశ్వరరావు లతో కలిసి మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, గృహ నిర్మాణశాఖ అధికారులు, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, అర్హుల జాబితా ఎంపిక, త్రాగునీటి సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి, వివిధ శాఖల మంత్రులు, ఉన్నత అధికారులతో హైదరాబాద్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, అర్హుల ఎంపిక, త్రాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారని తెలిపారు. ఈ నేపథ్యంలో భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, నూతన చట్టంలోని అంశాలను ప్రతి అధికారి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా పైలెట్ గ్రామాలలో ప్రారంభించిన నమూనా ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మండలాలలో పైలెట్ గ్రామాలు కాకుండా ఇతర గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాను ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అత్యంత పేదవారిని గుర్తించి, వారికి ప్రాధాన్యతనిస్తూ జాబితా రూపొందించాలని, అనర్హుల వివరాలు జాబితాలో లేకుండా పారదర్శకంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ ద్వారా నీటిని సరఫరా చేయలేని ప్రాంతాలకు వాటర్ ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మిషన్ భగీరథ పథకంలో పైప్ లైన్ లేని గ్రామాలలో ఇండ్ల జాబితా రూపొందించాలని, పథకంలో పైప్ లైన్ లీకేజీ లను గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని తెలిపారు. మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.