28-04-2025 09:02:55 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల సర్వే అధికారులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మండలంలోని గ్రామాల్లో వెరిఫికేషన్ ఆఫీసర్లు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వెరిఫికేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటి నిర్మాణ ప్రతిపాదిత స్థలం పరిశీలించి ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు.
వెరిఫికేషన్ అధికారి, ఎంపీడీవో క్రాంతి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇండ్ల నిర్మాణంలో గుడిసెలు, మట్టి గోడలు, రేకుల ఇండ్లు, పెంకుటిల్లు గలవారికి, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఇంటి నిర్మాణం కోసం అవసరమైన స్థలము ఉన్నవారికి, గ్రామంలో స్థిర నివాసం ఉన్నవారికి మొదటి దశలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇంటి వైశాల్యం 400 చదరపు అడుగులు తక్కువ కాకుండా ఆర్సీసీ స్లాబ్ తో 600 చదరపు అడుగుల వరకు నిర్మాణం చేపట్టవచ్చని తెలిపారు. లబ్ధిదారులకు సర్వే సమయంలో ఫోటో దిగిన స్థలము వద్ద మాత్రమే ఇంటి నిర్మాణం చేయాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. లబ్ధిదారుడు వేరే స్థలంలో ఇంటి నిర్మాణం చేసిన ఎడల ఇంటి నిర్మాణపు బిల్లు చెల్లించబడదన్నారు.