calender_icon.png 24 October, 2024 | 8:55 AM

ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు చట్ట వ్యతిరేకం

24-10-2024 02:36:40 AM

  1. హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్
  2. రాష్ట్రానికి కోర్టు నోటీసులు 

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): గ్రామ సభల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుకు జీవో జారీ చేసిందంటూ బీజేపీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రామసభ, వార్డు కమిటీల ఆమోదం లేకుండా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు కమిటీలను ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమని, దీనిని రాజ్యాంగ ఉల్లంఘనగా ప్రకటించాలని కోరారు.

ఈ పిటిషన్‌ను జస్టిస్ భీమపాక నగేష్ బుధవారం విచారించారు. పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.

ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి ఈ నెల 11న జారీ చేసిన జీవో 33ను సస్పెండ్ చేయాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. గ్రామసభలు, వార్డు కమిటీల ప్రస్తావన లేకుండా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చేపట్టడం చెల్లదని వాదించారు. గ్రామ పంచాయతీ వార్డు స్థాయి, మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రజాభిప్రాయం మేరకు కమిటీలు ఏర్పాటు ఉండాలని అన్నారు.

జీవో 33 ప్రకారం సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులను నియమిస్తారని, ఇది చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. ప్రజాహిత కార్యక్రమాలకు గ్రామసభల అనుమతి విధిగా తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు ఇళ్లను అందించాలనే సంకల్పం ఏకపక్షంగా కాకుండా ఉండాలంటే జీవోను సస్పెండ్ చేయాలని విన్నవించారు.

ఈ కమిటీలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశం ఉన్నదని, అలా చేస్తే నిజమైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని వాదించారు. 73వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా కమిటీల ఏర్పాటు జీవో ఉందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలకు వ్యతిరేకమని చెప్పారు. వాదనల తర్వాత ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.