- లబ్ధిదారుల ఎంపికలో లోపాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చు
- రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో భాగంగా లబ్ధిదారులను గుర్తించడానికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కరెక్టేనని హైకోర్టు తీర్పుచెప్పింది. ప్రభుత్వ పథకాల అమలు ప్రభుత్వ విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టంచేసింది.
ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని వెల్లడించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వ జీవో 33 సబబేనని పేర్కొంది. నిబంధనలకు వ్యతిరేకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగి ఉంటే అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది. జీవో 33ను సవాల్ చేస్తూ బీజేపీ ఎల్పీతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వీటిపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల తీర్చుచెప్పారు. తొలుత పిటిషనర్ల లాయర్లు వాదిస్తూ.. గ్రామసభ, వార్డు సమావేశాలతో సంబంధంలేకుండా ఇందిరమ్మకమిటీలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో రెండు పడకల ఇళ్ల పథక లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేశారని వివరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరగాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల్ల అర్హులను గుర్తించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలంటూ జిల్లా స్థాయిలో కలెక్టర్లు జీహెచ్‌ఎంసీ స్థాయిలో కమిషనర్‌ను ఆదేశిస్తూ జీవో 33 జారీ చేసిందని చెప్పారు. ఇందులో గ్రామస్థాయిలో సర్పంచ్/ ప్రత్యేక అధికారి చైర్మన్‌గా, స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు స్థానికులు ఉంటారని తెలిపారు.
వారిలో ఒకరు బీసీ, ఒకరు ఎస్సీ/ ఎస్టీలకు చెందిన వారుంటారన్నారు. వార్డు స్థాయిలో కౌన్సిలర్/కార్పొరేటర్ చైర్మన్గా ఉంటారని చెప్పారు. లబ్ధిదారుల తుది జాబితా తయారీలో ఇందిరమ్మ కమిటీల పాత్ర అంతిమం కాదని.. ప్రాథమికంగా జాబితా సిద్ధం చేసిన తరువాత గ్రామసభ/వార్డుసభలు నిర్వహించి అర్హుల ఎంపిక జరుగుతుందని స్పష్టంచేశారు.
ఇందిరమ్మ కమిటీల కారణంగా గ్రామసభలు/ వార్డు సభల లక్ష్యం నీరుగారిపోతుందన్న వాదన చట్ట ప్రకారం నిలవదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఇందిరమ్మ కమిటీల నిర్ణయం అంతిమం కాదని చెప్పారు. ప్రజాపాలన, ప్రజావాణి కింద కలెక్టర్‌కు అందిన దరఖాస్తులపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్నిపాలిటీల్లో వార్డు స్థాయి అధికారి సర్వే నిర్వహిస్తారని చెప్పారు.
అవాప్టస్ యాప్ ద్వారా లబ్ధిదారుల సమాచారం సేకరిస్తామని తెలిపారు. గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి మాత్రమే కమిటీలు సాయం చేస్తాయని పేర్కొన్నారు. అందువల్ల ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో జోక్యం చేసుకోలేమని చెప్పారు. లక్ష్యానికి విరుద్ధంగా అనర్హులను ఎంపిక చేసినట్టు తేలితే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించవచ్చని సూచించి, విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
క్రిమినల్ కేసుల్లో ఇకపై ఈ--సమన్లు
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): క్రిమినల్ కేసుల్లో ఇకపై ఈణు-సమన్లు అందజేయడానికి నేషనల్ సర్వీసెస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ (ఎక్ట్సెప్) పోర్టల్ ను జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రారంభించారు. హైదరాబాద్ జ్యుడిషియల్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు.
న్యాయసేవలు సమర్థంగా, పారదర్శకంగా ఉండేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. ఇందుకు ఎక్ట్సెప్ కీలకమైన ముందడుగని పేర్కొన్నారు. సత్వర పారదర్శక న్యాయం అందించడం లక్ష్యమని, దీనికి సాంకేతికత అవసరమని అన్నారు. క్రిమినల్ కేసుల విచారణలో అసాధారణ జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఇక్కడ కక్షిదారులేకాదని, న్యాయవ్యవస్థ సమగ్రత ముడిపడి ఉందని చెప్పారు.
క్రిమినల్ కేసుల విచారణలో జాప్యం వల్ల నిందితులు జైళ్లలోనే మగ్గుతుండటంతో రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. పీఎంఎల్సీ చట్టం కింద విచారణ జరగకుండా దీర్ఘకాలం నిర్బంధించరాదని, ఇది అధికరణ 21కు విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయాన్ని ప్రస్తావించారు.
విచారణలో జాప్యం వల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సమన్ల జారీలో జాప్యాన్ని ఎక్ట్సెప్ నివారిస్తుందని ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో సమన్ల జారీ ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చని అన్నారు. అడ్డంకులను అధిగమించడానిక సాంకేతికత ఒక ఆయుధమని అన్నారు.
జిల్లా న్యాయవ్యవస్థను పటిష్టపరచడం ద్వారా దేశం నలుమూలలా న్యాయం అందుతుందని పేర్కొన్నారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే మాట్లాడుతూ.. సివిల్ కేసుల్లో ఈతు౬సమన్లు అందించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ తరువాత తెలంగాణ -సమన్లు అందించనుందని పేర్కొన్నారు.
సమన్ల జారీలో అడ్డంకులు ఇకపై ఉండవని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతోపాటు అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ వైర్మన్ ఎ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్, న్యాయశాఖ కార్యదర్శి, రిజిస్ట్రార్, జనరల్ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.