calender_icon.png 21 December, 2024 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిర మెడలు వంచిన ధీశాలి

13-09-2024 02:05:06 AM

  1. జేఎన్‌యూ చాన్స్‌లర్‌గా వైదొలగాలని పట్టు 
  2. 500 మంది విద్యార్థులతో ఆమె ఇంటి ఎదుట నిరసన 
  3. నేరుగా మొమోరాండం చదివి వినిపించిన సీతారాం ఏచూరి 
  4. విద్యార్థి నేతగా తొలి విజయం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: వామపక్షాల్లో కీలక నేతగా ఎదిగిన సీతారాం ఏచూరి చాలా విషయాల్లో తనదైన ముద్ర వేశారు. ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా ఉండగానే ప్రభుత్వాన్ని ఎదురించి జైలుకు వెళ్లారు. ఎమర్జెన్సీ తర్వాత విద్యార్థి నేతగానే అప్పటికే రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీని సైతం ఎదురించారు.

ప్రధాని పదవి పోయినా ఢిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌గా కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె రాజీనామా చేయడంలో ఏచూరి కీలక పాత్ర పోషించారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఇందిరా ఇంటికే వెళ్లి నిరసన చేపట్టి తమ డిమాండ్లను సాధించుకోవడంలో ఏచూరి సఫలమయ్యారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. 

ఇంటి ఎదుట నిరసన

ఏ విషయంలోనైనా సూటిగా, భయం లేకుండా మాట్లాడుతారని ఏచూరికి పేరుంది. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జేఎన్‌యూలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఏచూరి ఎన్నికయ్యారు. ఆ ఏడాది 3 సార్లు ఎన్నిక జరిగినా ఆయనే పట్టు సాధించారు. ఏచూరి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జేఎన్‌యూ చాన్స్‌లర్‌గా ఉన్న ఇందిరాగాంధీపై ఒత్తిడి తెచ్చి ఆమెను ఆ పదవికి రాజీనామా చేయించడంలో కీలకంగా వ్యవహరించారు.

ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ పార్టీ ఓడిపోయి జనతా ప్రభుత్వం ఏర్పడింది. అయినా జేఎన్‌యూ చాన్స్‌లర్‌గా ఇందిరా కొనసాగుతూ వచ్చారు. విద్యార్థి సంఘం నాయకుడిగా ఏచూరి ఎన్నికైన తర్వాత వర్సిటీ చాన్స్‌లర్‌గా ఇందిరా ఉండడాన్ని ఏచూరి వ్యతిరేకించారు. దాదాపు 500 మంది విద్యార్థులతో కలిసి ఇందిరాగాంధీ నివాసానికి వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. 

బయటికి రావాలని పట్టుబట్టి..

విద్యార్థులు ఆందోళన చేస్తుండటంతో ఐదుగురు ముఖ్య నేతలను లోపలికి పంపమని భద్రతా సిబ్బందికి ఇందిరా సూచించా రు. కానీ అందుకు ఒప్పుకోని ఏచూరి.. ఇందిరనే నేరుగా వచ్చి తమతో చర్చించాలని పట్టుబట్టారు. దీంతో ఇందిరాగాంధీ బయటకు వచ్చి విద్యార్థులను కలిశారు. చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేయాలని తమ డిమాండ్‌ను ఇందిర ముందు ఉంచారు.

ఆమె ఆ పదవికి ఎందుకు రాజీనామా చేయాలో ఓ మొమోరాండాన్ని చదివి వినిపించారు ఏచూరి. ఆయన చదువుతున్నంత సేపు ఇందిర ఎలాంటి హావభావాలు వ్యక్తం చేయకుండా పూర్తిగా విన్నారు. తర్వాత ఆ మొమోరాండాన్ని ఇందిరకు అందివ్వగా ఆమె స్వీకరించారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు చాన్స్‌లర్ పదవికి ఇందిర రాజీనామా చేశారు.