calender_icon.png 3 November, 2024 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో ఇందిరా మహిళాశక్తి వారోత్సవాలు

03-11-2024 12:15:08 AM

  1. ప్రతి మహిళను ఎస్‌హెచ్‌జీలో చేర్పించడమే లక్ష్యం
  2. ఉపాధిహామీలపై డీఆర్డీవోలకు మంత్రి సీతక్క దిశానిర్ధేశం

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో చేర్చేలా అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.

డిసెంబర్ మొదటివారంలో ఇందిరా మహిళా శక్తి పథకానికి సంబంధించి వారోత్సవాలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా మహిళా సంఘా లకు వడ్డీ లేని రుణాలు ఇప్పించేలా గ్రామగ్రామాన బ్యాంకర్లతో సదస్సులు నిర్వహించాలని సూచించారు. శనివారం సచివాలయంలో డీఆర్డీవోలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధిశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫిఉల్లా, సెర్ప్ సీఈవో దివ్యాదేవ రాజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా వచ్చే 5నెలల్లో చేపట్టాల్సిన పనులపై జిల్లా అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించడంతోపాటు ప్రజలకు ఉపయోగపడే పనులను చేపట్టాలని సూచించారు. మార్చిలోపు ఉపాధిహామీ పనుల కోసం రూ.1,372 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. దానికనుగుణంగా డీఆర్డీవోలు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛ భారత్ మిషన్ పనుల కోసం ఉపాధి నిధులు వెచ్చించేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలు, అభివృద్ధి ప్రాతిపదికన పనులను గుర్తించాలన్నారు. 

గ్రామసభల్లో ప్రజల భాగస్వా మ్యాన్ని పెంచి గ్రామసభలను విధిగా నిర్వహించాలని చెప్పారు. గ్రామస్తుల అభిప్రా యాలకు అనుగుణంగా ఉపాధి పనులను చేపట్టాలని కోరారు. చెక్ డ్యాంల నిర్మాణం, పంట కాలువల్లో పూడికతీత పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరా మహిళా శక్తి ముఖ్య ఉద్ధేశమన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేయాలని కోరారు.