డిసిసి అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి..
గజ్వేల్ (విజయక్రాంతి): గరీబి హటావో అన్న నినాదంతో దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీదేనని డిసిసి అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, ప్రజ్ఞాపూర్ లోని ఇందిరా గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గజ్వేల్ ఇందిరాపార్క్ వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోటి కపడా మఖాన్ నినాదంతో ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎదగడం కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించి భారతదేశ స్థితిగతులను ఇందిరా గాంధీ మార్చి వేశారన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి గ్రామానికి రోడ్ల సౌకర్యం, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ పథకంలో ఇండ్ల నిర్మాణం, దళితులకు భూ పంపిణీ, వ్యవసాయానికి కావలసిన బోరు బావుల నిర్మాణం పథకాలను ప్రవేశపెట్టి పేదలకు ఎంతో మేలు చేశారన్నారు.
ప్రైవేటీకంలో ఉన్న బ్యాంకులను జాతీయం చేసి 20 సూత్రాల పథకాలను ప్రవేశపెట్టి భారత దేశ ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టారన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని పెంపొందించారన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అండగా ఉండి సహకారం అందిస్తున్నారని నర్సారెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ స్ఫూర్తితో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి రైతులకు ఉచిత విద్యుత్తు రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ప్రస్తుతం వారి బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం పేరుతో ప్రజా పాలన కొనసాగిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని నర్సారెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.