వేలంలో భారత క్రికెటర్లకు పెద్దపీట
- భువనేశ్వర్‌కు రూ.10.75 కోట్లు, దీపక్‌కు 9.25 కోట్లు
- ముకేశ్, ఆకాశ్‌లకు జాక్‌పాట్
- ముగిసిన ఐపీఎల్ మెగావేలం
ఐపీఎల్ మెగావేలంలో రెండో రోజు కూడా ఫ్రాంచైజీలు భారత క్రికెటర్ల వైపే మొగ్గు చూపాయి. గతానికి భిన్నంగా ఈసారి ఫ్రాంచైజీలు విదేశీలు వద్దు.. స్వదేశీలే ముద్దు అన్న చందంగా వేలంలో భారత క్రికెటర్లకు ఎక్కువ ఖర్చు పెట్టడం ఆసక్తిగా మారింది. రెండో రోజు వేలంలో భారత సీనియర్ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా..
ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్, దీపక్ చహర్‌లకు మంచి ధర పలకడం విశేషం. ఇక శార్దూల్, పృథ్వీ షా, రహానే, కేఎస్ భరత్, మయాంక్ అగర్వాల్ సహా మరికొందరు ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లలో నితీశ్ రానా, తుషార్ దేశ్ పాండేలకు మంచి ధర దక్కింది.
విజయక్రాంతి, ఖేల్ విభాగం : సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నిర్వహించిన ఐపీఎల్ మెగావేలంలో ఫ్రాంచైజీలు రెండో రోజు కూడా ఫ్రాంచైజీలు భారత క్రికెటర్లకే పట్టం కట్టాయి. ఎప్పుడు వేలం జరిగినా విదేశీ క్రికెటర్ల వెంబడి ఎక్కువగా పడే ఫ్రాంచైజీలు ఈసారి మాత్రం గేర్‌ను మార్చాయి.
వేలం ప్రారంభమైన నాటి నుంచే భారత క్రికెటర్లను అందలం ఎక్కించి విదేశీ క్రికెటర్లకు మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేసింది. బట్లర్, హాజిల్ వుడ్, స్టోయినిస్, బౌల్ట్, రబాడ, స్టార్క్ లాంటి పేరున్న విదేశీ ఆటగాళ్లకు కాస్తో కూస్తో మంచి ధర దక్కింది.
గతంలో భారీ ధరకు అమ్ముడైన మ్యాక్స్‌వెల్, లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లను తక్కువ ధరకే కొనుగోలు చేశాయి. ఐపీఎల్ ప్రారంభంలో అందుబాటులో ఉండే విదేశీ ఆటగాళ్లు సిరీస్‌లో పేరుతో, ఇతర కారణాల రిత్యా మధ్యలోనే వైదొలుగుతున్నారు.
దీంతో ఒక్క మ్యాచ్ ఆడినా పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించాల్సి వస్తోంది. దీని వల్ల ఫ్రాంచైజీలకు పెద్దగా ఒరిగేదేం లేదు. అందుకే ఈసారి తెలివిగా వ్యవహరించిన ఫ్రాంచైజీలు చాలా మంది భారత స్టార్ ఆటగాళ్లు సహా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు మంచి ధర ఇచ్చి కొనుగోలు చేసింది.
భువీకీ రికార్డు ధర..
తొలి రోజే దాదాపు స్టార్ క్రికెటర్లు అంతా వేలంలోకి రావడంతో రెండో రోజు వేలంలో పెద్దగా మెరుపులు లేవు. మొదటి రోజు పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్‌లు భారీ ధర పలికి చరిత్ర సృష్టించారు. ఇక రెండో రోజు భారత వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. రూ. 10.75 కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది.
రూ. 2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగిన భువనేశ్వర్ కోసం ముంబై, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడ్డాయి. అయితే అనూహ్యంగా ఆఖరి నిమిషంలో రేసులోకి వచ్చిన బెంగళూరు భువీని దక్కించుకుంది. ఎప్పుడో రెండేళ్ల క్రితమే జాతీయ జట్టుకు దూరమైన భువనేశ్వర్ ఇంత ధర పలకడం ఆశ్చర్యం కలిగించే విషయం.
రెండో రోజు భువనేశ్వర్ మినహా వేలంలోకి వచ్చిన ఏ క్రికెటర్ రూ. 10 కోట్లు దాటలేదు. ఇక భారత క్రికెటర్ దీపక్ చహర్ కూడా మంచి ధర పలికాడు. అతడి కోసం ముంబై ఇండియన్స్ రూ. 9.25 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం. మరో భారత పేసర్ ముకేశ్ కుమార్‌కు జాక్‌పాట్ తగిలింది.
2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ముకేశ్ కోసం చెన్నై, పంజాబ్ పోటీ పడగా.. చివరగా ఢిల్లీ రైట్ టూ మ్యాచ్ (ఆర్‌టీఎం) ఉపయోగించి రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా పేసర్‌గా ఎదుగుతున్న ఆకాశ్ దీప్ కూడా భారీ ధర పలికాడు. లక్నో అతడిని రూ. 8 కోట్లకు సొంతం చేసుకుంది.
భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రూ. 3.20 కోట్లకు గుజరాత్‌కు అమ్ముడయ్యాడు. విదేశీ క్రికెటర్లలో మార్కో జాన్సెన్ రూ. 7 కోట్లకు పంజాబ్ దక్కించుకోగా.. టిమ్ డేవిడ్ కోసం ఆర్‌సీబీ 3 కోట్లు ఖర్చు చేసింది. ఇక భారత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లలో తుషార్ దేశ్ పాండే రాజస్థాన్‌కు రూ. 6.50 కోట్లకు అమ్ముడవ్వగా..
రసిక్ సలామ్ రూ. 6 కోట్లకు బెంగళూరు చెంతకు చేరాడు. నితీశ్ రాణాను కూడా రాజస్థాన్ 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను బెంగళూరు రూ. 5.75 కోట్లకు దక్కించుకుంది.
వీళ్లను పట్టించుకోలేదు..
గతంలో ఐపీఎల్‌లో స్టార్లు చలామణి అయిన కొందరికి మాత్రం నిరాశే ఎదురైంది. తొలి రోజు వార్నర్, అన్‌మోల్ ప్రీత్, యశ్ దుల్ లాంటి క్రికెటర్లు అన్‌సోల్డ్ జాబితాలో చేరితో రెండో రోజు ఆ సంఖ్య రెట్టింపు అయింది. శార్దూల్ ఠాకూర్, పృథ్వీ షా, పియూశ్ చావ్లా, ఉమేశ్ యాదవ్, శివమ్ మావి, రాజ్ లింబానీపై ఎవరు ఆసక్తి చూపలేదు.
ఇక న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, ఆసీస్ సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, నిసాంక, బ్రాండన్ కింగ్, గుస్ అకిన్‌సన్, నవీన్ ఉల్ హక్, తేజస్వీ దహియా, మురుగన్ అశ్విన్, సందీప్ వారియర్, మాథ్యూ షార్ట్ లాంటి క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో అన్‌సోల్డ్ జాబితాలో చేరిపోయారు.