- సెన్సెక్స్ 567 పాయింట్లు రికవరీ
23,150 ఎగువకు నిఫ్టీ
ముంబై, జనవరి 22: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకునే టారీఫ్ నిర్ణయాలు, ఇమ్మిగ్రేషన్ చర్యల పట్ల ఇన్వెస్టర్లలో ఆందోళన తలెత్తడం తో మంగళవారం నిలువునా 7 నెలల కనిష్ఠస్థాయికి పతనమైన భారత స్టాక్ మార్కెట్ బుధవారం ఐటీ స్టాక్స్ అండతో కొంతమేర కోలుకున్నది. సెన్సెక్స్ 567 పాయింట్లు కోలుకుని 76,405 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 23,150 పాయింట్ల ఎగువన 23,155పాయింట్ల వద్ద నిలిచింది. హెవీవెయిట్ షేర్లు టీసీఎస్,ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు స్టాక్ సూచీలు రికవరీకి కారణమయ్యాయి.
కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటం, రూపాయి క్షీణతలతో విదేశీ ఈక్విటీ పెట్టుబడులు తరలివెళు తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్లలో 2,802 స్టాక్స్ క్షీణించగా, 1,142 స్టాక్స్ పెరిగాయి. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ మరో రూ.2.18 లక్షల కోట్లు తగ్గి రూ.421.88 లక్షల కోట్లకు పడిపోయింది.
చిన్న షేర్లు విలవిల
ఐటీ స్టాక్స్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంతో స్టాక్ సూచీలు కోలుకున్నప్పటికీ, అధిక విలువలు ఉన్నాయన్న ఆందోళనతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లను విక్రయించారని, దీనితో చిన్న షేర్లు భారీగా పతనమయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.56 శాతం, మిడ్‌క్యాప్ సూచి 1.2 శాతం చొప్పున తగ్గాయి.
ఇన్ఫోసిస్ టాప్ గెయినర్
ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ కౌంటర్లో కనిష్ఠస్థాయ వద్ద కొనుగోళ్లు జరగడంతో ఆ షేరు సెన్సెక్స్ ప్యాక్‌లో ఈ షేరు అత్యధికంగా 3.16 శాతం పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, 3.97 శాతం, టెక్ మహీంద్రా 2.28 శాతం చొప్పున పెరిగాయి. సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు 2 శాతం వరకూ లాభపడ్డాయి.
మరోవైపు టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ 2.2 శాతం వరకూ క్షీణించాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా రియల్టీ ఇండెక్స్ 4.53 శాతం తగ్గింది.
ఇండస్ట్రియల్స్ సూచి 1.88 శాతం,క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.82 శాతం, పవర్ ఇండెక్స్ 1.57 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 1,38 శాతం చొప్పున క్షీణించాయి ఐటీ సూచి 2.19 శాతం లాభపడింది. టెక్నాలజీ ఇండెక్స్ 1.65 శాతం, బ్యాంకెక్స్ 0.26 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.17 శాతం చొప్పున పెరిగాయి.
కొనసాగిన ఎఫ్‌పీఐల విక్రయాలు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలి యో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) విక్రయాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మరింత భారీ గా రూ.5,920 కోట్ల నికర విక్రయాలు జరిపిన ఎఫ్‌పీఐలు బుధవారం మరో రూ. 4,026 కోట్లు వెనక్కు తీసుకున్నట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీం తో జనవరి నెలలో ఇప్పటివరకూ వీరు మార్కె ట్ నుంచి వెనక్కుతీసుకున్న పెట్టుబడులు రూ.59,000 కోట్లను మించాయి.
డాలర్ పటిష్టంగా ఉంటూ యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయమైన రాబడులు ఇస్తున్నంతకాలం ఎఫ్‌పీఐలు భారత్ మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 108 పైన, 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ 4.60 శాతం వద్ద ఉన్నాయని తెలిపారు.