07-02-2025 12:55:59 AM
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పరిణామాలు, అమెరికా బాండ్ల రాబడి తగ్గుముఖం పట్టడం వంటి పాజిటివ్ సంకేతాలున్నప్పటికీ.. మన మార్కెట్లు నష్టాల్లో ముగియడం గమనార్హం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్న వేళ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.సెన్సెక్స్ ఉదయం 78,513.36 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. రోజంతా అదే బాటలో పయనించింది.
చివరికి 213.12 పాయింట్ల నష్టంతో 78,058.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.55 పాయింట్ల నష్టంతో 23,622.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.60గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.94 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2880 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.