మళ్లీ 80వేల ఎగువకు సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలుసోమవారం లాభాల్లో ముగిశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి నెమ్మదించడంతో.. దాని ప్రభావం ఆరంభంలో సూచీలపై పడింది. దీంతో నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. మధ్యాహ్నం తర్వాత రాణించాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ 80 వేల ఎగువన ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 79,743.87 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,802.79) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. కాసేటికే మరింత నష్టాల్లోకి జారుకుని 79,308 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కోలుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ.. చివరికి 445.29 పాయింట్ల లాభంతో 80,248.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 144.95 పాయింట్ల లాభంతో 24,276.05 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి 84.71 వద్ద ముగిసింది.
సిమెంట్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్ (3.93 శాతం) ప్రధానంగా లాభపడింది. ఆపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 72.68 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2659 డాలర్ల వద్ద కొనసాగుతోంది.