calender_icon.png 25 October, 2024 | 9:52 AM

స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు

25-10-2024 12:00:00 AM

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో వరుస నష్టాలతో ట్రేడవుతున్న సూచీలు.. గురువారం సైతం స్వల్ప నష్టాలతో ముగిశాయి.

హిందుస్థాన్ యూనిలీవర్ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో హెయూఎల్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. 5 శాతం నష్టంతో కంపెనీ షేరు రూ.2502 వద్ద ముగిసింది.సెన్సెక్స్ ఉదయం 80,098.30 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,081.98) ఫ్లాట్‌గా ప్రారంభమైంది.

ఇంట్రాడేలో 79,813.02- 80,259.82 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 16.82 పాయింట్ల నష్టంతో 80,065 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు నష్టపోయి 24,399 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీపోర్ట్స్  షేర్లు లాభాల్లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, ఐటీసీ, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76.49 డాలర్లుగా ఉండగా.. బంగారం ఔన్సు 2,749 డాలర్ల వద్ద కొనసాగుతోంది.