calender_icon.png 1 February, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌పై ఆశలు లాభాల్లో ముగిసిన సూచీలు

01-02-2025 12:57:59 AM

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలోనే పయనించాయి. ఐటీ, ఆటో రంగ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణించాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 740 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 258 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను.. దేశ జీడీపీ 6.3-6.8 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇది మార్కెట్ల ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వృద్ధికి ఊతమిచ్చే ప్రకటనలు ఉంటాయనే అంచనాల నేపథ్యంలో సూచీలు రాణించాయి. డీప్‌సీక్ ఆందోళనల మధ్య నష్టాల్లో జారుకున్న ఐటీ షేర్లు తిరిగి పుంజుకోవడం మారెట్‌కు కలిసొచ్చింది.

దీంతో పాటు ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మార్కెట్లు పరుగుకు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. సెన్సెక్స్ ఉదయం 76,888.89 (క్రితం ముగింపు 76,759.81) వద్ద లాభాల్లో ప్రారంభమైంది.

రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 77,605.96 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 740 పాయింట్ల లాభంతో 77,500.57 వద్ద ముగిసింది. నిఫ్టీ 258 పాయింట్ల లాభంతో 23,508 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.61 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, టైటాన్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. ఐటీసీ హోటల్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్‌ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76.67 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,846.90 డాలర్ల వద్ద కొనసాగుతోంది.