calender_icon.png 16 November, 2024 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ వృద్ధి 7.2 శాతం

16-11-2024 03:29:36 AM

ఈ ఏడాది ఆర్బీఐ వడ్డీ రేట్లు కోత ఉండదు

మూడీస్ అంచనా

న్యూఢిల్లీ, నవంబర్ 15: ఈ 2024 క్యాలండర్ సంవత్సరంలో భారత్ 7.2 శాతం వృద్ధి సాధిస్తుందని ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తాజా అంచనాల్లో పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ స్వీట్‌స్పాట్‌లో ఉన్నదని, అయితే ద్రవ్యోల్బణం రిస్క్ ల కారణంగా రిజర్వ్‌బ్యాంక్ ఈ ఏడాది ద్రవ్య విధానాన్ని కఠినంగానే ఉంచుతుందని, వడ్డీ రేట్లను తగ్గించదని మూడీస్ శుక్రవారం విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది.

సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, రానున్న నెలల్లో ఆహారోత్పత్తుల ధరలు దిగివస్తాయని, తద్వారా ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ లక్ష్యంవైపు తగ్గుముఖం పడుతుందని మూడీస్ వివరించింది. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠస్థాయి 6.21 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. కొన్ని ఆహారోత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణాన్ని ఒడిదుడుకులకు లోనుచేస్తున్నాయని మూడీస్ వ్యాఖ్యానించింది.

తీవ్రతరమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ద్వారా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ద్వారా ద్రవ్యో ల్బణానికి రిస్క్‌లు పొంచిఉన్నందున, విధాన సరళీకరణపై ఆర్బీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నదని రేటింగ్ ఏజెన్సీ వివరించింది. అక్టో బర్ సమీక్షలో ఆర్బీఐ తన విధాన వైఖరిని న్యూట్రల్‌కు మార్చినప్పటికీ, రెపో రేటు 6.5 శాతం వద్ద యథాతథంగా అట్టిపెట్టిందని, దాదాపు కఠిన ద్రవ్య విధానాన్నే వచ్చే ఏడాది తొలినాళ్ల వరకూ కొనసాగిస్తుందని మూడీస్ వివరించింది. వచ్చే డిసెంబర్ సమీక్షా సమావేశంలో ఆర్బీఐ బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను తగ్గించదని అంచనా వేసింది. 

వినియోగం పెరుగుతుంది

ప్రస్తుత పండుగ సీజన్ నేపథ్యంలో కుటుంబ వినియోగం వృద్ధిచెందుతుందని, గ్రామీణ డిమాండ్ పుంజుకుంటున్నదని మూడీస్ తెలిపింది. బిజినెస్ సెంటిమెంట్ మెరుగుపడటం, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం పెరగడంతో ప్రైవేటు పెట్టుబడులకు మద్దతు లభిస్తుందని పేర్కొంది. 2024 క్యాలండర్ సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో (ఏప్రిల్ భారత్ వాస్తవ జీడీపీ 6.7 శాతం వృద్ధిచెందిందని, జూలై త్రైమాసికంలో కూడా ఆర్థికాభివృద్ధి స్థిరంగా ఉన్న సంకేతాలు వెల్లడ య్యాయని తెలిపింది.

ఒకవైపు పటిష్ఠ వృద్ధి, మరోవైపు అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం కలిసి భారత ఆర్థిక వ్యవస్థను స్వీట్‌స్పాట్‌లో ఉంచుతున్నాయని, ఈ కారణంగా 2024 క్యాలండర్ సంవత్సరంలో 7.2 శాతం వృద్ధిని తాము అంచనా వేస్తున్నట్లు మూడీస్ ఎకానమిస్టులు పేర్కొన్నారు. 2025లో 6.6 శాతం, 2026లో 6.5 శాతం చొప్పున వృద్ధి అంచనాల్ని ప్రకటించారు. పటిష్టమైన ఆర్థిక ఫండమెంటల్స్, ఆరోగ్యకరమైన కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు,  సరిపడా విదేశీ మారక నిల్వలు భవిష్యత్తు వృద్ధి అంచనాలకు బాసటగా నిలుస్తున్నాయని మూడీస్ వివరించింది.