calender_icon.png 23 December, 2024 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలాసానికే భారతీయులు జై

23-12-2024 02:16:52 AM

* బడ్జెట్ కంటే లగ్జరీ ట్రావెల్‌కే ఓటు

* 50శాతం పెరిగిన బిజినెస్ క్లాస్ బుకింగ్‌లు

* ప్రయాణికులపై సెలబ్రేషన్ టూరిజం ప్రభావం

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ‘పర్యటనకు వెళ్లినప్పుడు లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తాను. డబ్బు ల గురించి అంతగా పట్టించుకోను’ అని డిల్లీకి చెందిన 25ఏళ్ల విద్యార్థిని ముస్కాన్ అగర్వాల్ అభిప్రాయం ఇది. కేవలం ఆమె మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా అనేక మంది ఈ తరహాలోనే అలోచిస్తున్నారట. బడ్జెట్ కంటే లగ్జరీ ట్రావెల్‌కు ప్రాధాన్యత ఇస్తున్న భారతీయుల సంఖ్య గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతోందట.   ప్రముఖ జాతీయ మీడియా చేసిన ఓ అధ్యయనం ద్వారా ఈ విషయం వెల్లడైంది. కొన్ని ట్రావెల్ ఏజెన్సీల దగ్గర నుంచి డేటా ను తీసుకుని ప్రజల పర్యటనలకు సంబంధించిన అంశాలను పరిశీలించింది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం విలాసానికి భారతీయులు అధికంగా ఖర్చు చేశారని గుర్తించినట్టు తన కథనం పేర్కొంది. 

ట్రావెల్ ఎజెన్సీల సమాచారం ప్రకారం

విమానయానం సందర్భంగా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని స్కైస్కానర్ అనే ట్రావెల్ ఏజెన్సీ పేర్కొంది. ఈ ఏడాది దాదా పు 37శాతం ప్రయాణికులు ఎకానమి క్లాస్ నుంచి బిజినెస్ క్లాస్‌కు తమ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసుకున్నట్టు వెల్లడించింది. మరో 44శాతం మంది తమ ట్రిప్‌ను లగ్జరీగా మొదలుపెట్టేందుకు ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్ యాక్సెస్‌ను కోనుగోలు చేశారని వివరించింది. బిజినెస్ క్లాస్ బుకింగ్‌లు ఈ ఏడాది 50 పెరిగినట్టు మేక్‌మైట్రిప్ తెలిపింది.

ఈ పెరుగుదల అంతర్జాతీయ విమానాల్లో 80శాతం ఉంటే డొమెస్టిక్ విమానాల్లో 27శాతం ఉన్నట్టు చెప్పింది. డొమెస్టిక్ హోటళ్లలో రూ.10వేల కంటే ఖరీదైన రూమ్‌లను బుక్ చేసుకునే వారి సంఖ్య గత ఏడాదితో పోల్చితే రెండుశాతం పెరిగినట్టు ట్రావెల్ ఏజెన్సీల నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య అంతర్జాతీయ హోటళ్లలో ఏకంగా ఆరు శాతం పెరిగింది. దీన్ని బట్టి ఇటీవల కాలంలో ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చినట్టు స్పష్టమవుతుంది. బడ్జెట్ కంటే లగ్జరీకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తుంది. 

భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం

లగ్జరీ ట్రిప్‌ను కోరుకుంటున్న భారత ప్రయాణికుల సంఖ్య అసాధారణంగా పెరిగిందని టామరిండ్ గ్లోబల్ ట్రావెల్ ఏజెన్సీ డైరెక్టర్ లూయిస్ డిసౌజా పేర్కొన్నారు. ఈ తరహా ప్రయాణికుల సంఖ్య 2025లో మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత యాత్రికులు సంప్రదాయ సందర్శనా స్థలాలకు మించిన ప్రత్యేక అనుభవాలను కోరకుంటున్నారని వివరించారు. గ్లోబల్ లగ్జరీ ట్రావెల్ మార్కెట్‌లో భారత్ పవర్ హౌస్‌గా మారుతుందని రెడ్ డాట్ రిప్రెసెంటేషన్ బిజినెస్ హెడ్ ప్రభాకర్ కామత్ అన్నారు. అనందంపై దృష్టి పెట్టడం వల్లే భారతీయ పర్యాటకుల్లో ప్రాధాన్యతలు మారుతున్నాయని తెలిపారు. 

లగ్జరీ వైపు మొగ్గు ఎందుకంటే

విలాసవంతమైన ట్రిప్‌లు కోరుకుంటున్న వారిలో యువత సంఖ్య అధికం గా ఉంది. సెలవుదినాల్లో వీలైనన్ని తీపి జ్ఞాపకాలు పొందేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. సం ప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తుండటంతో ప్రయాణికుల ప్రాధాన్యతల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే  భారత్‌లోని ఆర్థి క అభివృద్ధి దేశంలోని మధ్య, ఉన్నత తరగతికి చెందిన ప్రజలు ప్రీమియం ప్రయాణ అనుభవాలు పొందేందుకు వీలు కల్పించిందని పేర్కొంటున్నారు. 

భారత ప్రయాణికులపై సోషల్ మీడి యా ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవి స్తూ అందుకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుం డటంతో వాటిని చూసిన మరికొందరు లగ్జరీ ట్రిప్‌లవైపు ఆకర్షితులవుతున్నారని లూయిస్, కామత్‌లు పేర్కొన్నారు. వీటికి తోడు సెలబ్రేషన్ టూరిజం ప్రభా వం అధికంగా ఉన్నట్టు తెలిపారు.