* ట్రూడో రాజీమానా ప్రకటన తర్వాత కెనడాలో వేడెక్కిన రాజకీయం
* కొత్త నేతను ఎన్నుకునే పనిలో లిబరల్ పార్టీ నేతలు
* పరిశీలనలో భారత్‌కు చెందిన అనితా ఆనంద్ పేరు
ఒట్టావా, జనవరి 7: కెనడాలో రాజకీయం వేడెక్కింది. జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటన తర్వాత కొత్త నేతను ఎన్నుకునే పనిలో అధికార లిబరల్ పార్టీ నేతలు తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో తదుపరి ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్ట్రీ క్లార్క్‌తో పాటు భారత సంతతికి చెందిన ఎంపీ అనితా ఆనంద్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. లిబరల్ పార్టీ నేతలు అనితా ఆనంద్‌వైపు మొగ్గు చూపిస్తే కెనడా ప్రధానిగా ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
ఎవరీ అనితా అనంద్?
అనితా ఆనంద్ మూలాలు తమిళనాడు, పంజాబిలో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసిన అనిత.. 2019లో ఓక్‌విల్లే నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం ట్రూడో క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 2019 మధ్య పబ్లిక్ సర్వీస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రక్షణ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు.
గత నెలలో జరిగి క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగ్గా.. ఆమెకు రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 57ఏళ్ల అనితా ఆనంద్ తండ్రి తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా తల్లి పంజాబీ. ఇదిలా ఉంటే లిబరల్ పార్టీ నేతలు, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ప్రధాని పదవితోపాటు పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు సోమవారం ట్రూడో ప్రకటించిన విషయం తెలిసిందే.
ట్రంప్ నోట మళ్లీ అదే మాట
రాజీనామా చేస్తానంటూ ట్రూడో ప్రకటించిన అనంతరం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన 51వ రాష్ట్ర ఆకాంక్షను సోషల్ మీడియా వేదికగా వ్యక్త పరిచారు. ‘అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాలని ఆ దేశంలోని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. దీనివల్ల కెనడాకు ఇచ్చే రాయితీల విషయంలో అమెరికాకు మేలు కలుగుతుంది.
ఆ విషయం ట్రూడోకు కూడా తెలుసు.అందుకే ఆయన రాజీనామా చేశారు. అమెరికాలో భాగం అయితే సుంకాలు ఉండవు, పన్నులు తగ్గుతాయి. అంతేకాక రష్యా, చైనాలకు చెందిన షిప్‌ల వల్ల కెనడాకు ఎలాంటి ముప్పు ఉండదు’ అని రాసుకొచ్చారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా ప్రభుత్వం ఎటువంటి కామెంట్ చేయలేదు.