calender_icon.png 24 October, 2024 | 11:47 AM

మూడో భాగం ట్రైలర్‌తో భారతీయుడు 2

12-07-2024 12:05:00 AM

కమల్ హాసన్, శంకర్ కలయికలో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కలయికలో 28 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్ కాగా, ఈ కోవలో మరో భాగం కూడా రానున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించారు. అయితే ‘భారతీయుడు 3’ ట్రైలర్‌ని ‘భారతీయుడు 2’ సినిమా ఆఖరున చూపించబోతున్నాం అంటూ తాజాగా శంకర్ వెల్లడించారు. తద్వారా సినిమాపై గల అంచనాలను మరింత పెంచారాయన. రెండవ భాగం విడదలయిన ఆరు నెలల తర్వాత ‘భారతీయుడు 3’ తెరమీదికి రానుందన్న దర్శకుడు, ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నట్టు తెలిపారు.

గేమ్ చేంజర్ మాస్ సినిమా

‘భారతీయుడు 2’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న శంకర్, రామ్‌చరణ్‌తో తాను చేసిన ‘గేమ్ చేంజర్’ గురించి కూడా ప్రస్తావించారు. “నేను దర్శకత్వం వహించిన తమిళ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. నేరుగా ఒక్కటైనా తెలుగు సినిమా చేయాలని అనుకునే క్రమంలో కొన్ని ప్రయత్నాలు విఫలమైనా ‘గేమ్ చేంజర్’ ద్వారా అది సాధ్యపడింది. ఇది పూర్తిగా యాక్షన్ చిత్రం. ఇలాంటి మాస్ సినిమా చాలా రోజుల తర్వాత చేశాను” అని చెప్పుకొచ్చారు. ఈ విషయం అందుకున్న మెగాభిమానులు ఆనందంతో ‘గేమ్‌చేంజర్  మాస్ ఫిల్మ్’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.