calender_icon.png 25 October, 2024 | 12:03 PM

భారతీయుడు 2 నిడివి తగ్గింపు

14-07-2024 01:39:10 AM

28 సంవత్సరాల తర్వాత భారీ తారాగణం, నిర్మాణ వ్యయాలతో ఎన్నో అంచనాల నడుమ ఈ నెల 12న తెరమీదికొచ్చింది ‘భారతీయుడు 2’ చిత్రం. కమల్ హాసన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. సిద్ధార్థ్ పాత్రతో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులు మెచ్చుకునేలా ఉన్నాయి. అయితే విశ్లేషకులు శంకర్ పట్టు తప్పాడంటూ విమర్శిస్తున్నారు. తెలిసిన కథాంశాన్నే మరోమారు తెరపై చూపించడం.. అది చెప్పే విధానంలో బిగి లేకపోవడం.. సన్నివేశాన్ని నిలబెట్టగలిగే సంగీతం ఆ స్థాయిని అందుకోలేకపోవడం.. ఇలా చాలా విషయాల్లో సినిమా విఫలమైందని విమర్శలు వస్తున్నాయి.

నటుల సంఖ్య పెరిగినా, ప్రేక్షకుడు ఏ పాత్రతోనూ కనెక్ట్ కాలేని పరిస్థితి. వెరసి సినిమా నిడివి మూడు గంటల మేర ఉండటంతో కౌంటర్ వద్ద టికెట్ తెగడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ వర్గాలు సినిమా నిడివిని 20 నిమిషాల మేర తగ్గించాయి. విడుదలైన రెండవ రోజు నుండే సుమారు రెండు గంటల నలభై నిమిషాల వ్యవధితో కూడిన చిత్రాన్ని  ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. సినిమాకి వస్తోన్న స్పందనకి తోడు పెరిగిన టిక్కెట్టు ధరల మధ్య చిత్ర బృందం తీసుకున్న ఈ నిర్ణయం సినిమాని ఎంతమేరకు గట్టెక్కిస్తుందో మరి. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రభావంతో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఎలా ఉండబోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి