20-03-2025 11:55:53 PM
ఉజ్బెకిస్థాన్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన 150 మంది భారతీయ విద్యార్థులు...
హైదరాబాద్ (విజయక్రాంతి): మన దేశంలో ఎంబీబీఎస్ చేయలేని అనేక మంది ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, జార్జియా, అజర్‌బైజాన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేస్తున్నారు. ఒకప్పుడు ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌కు ఎంతో డిమాండ్ ఉండేది. కానీ ఎప్పుడైతే రష్యా మధ్య యుద్ధం మొదలైందో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ చదువుతున్న భారత విద్యార్థులు అనేక మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అనుకుంటూ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అక్కడి నుంచి తిరిగివచ్చారు. ఎలాగోలా వచ్చినా తమ చదువు మధ్యలోనే ఆగిపోవడంతో.. ఎంబీబీఎస్ పూర్తి చేయడం ఎలా అని గాబరా పడ్డారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పించిన కన్సల్టెన్సీలపై విద్యార్థుల తల్లితండ్రులు ఒత్తిడి తీసుకువచ్చారు. కన్సల్టెన్సీలు, తల్లితండ్రులు వివిధ మార్గాల్లో చేసిన ప్రయత్నాలతో మన విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు, ప్రభుత్వం సహకారం వల్ల ఉక్రెయిన్ అంగీకారంతో పొరుగున ఉన్న ఉజ్బెకిస్థాన్‌లో మన విద్యార్థులు విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తిచేశారు. 150 మంది భారతీయ విద్యార్థులు ఈ విధంగా తమ ఎంబీబీఎస్ చదువును పూర్తి చేసుకుని ఇటీవలే స్వదేశానికి తిరిగివచ్చారు.
ఈ సందర్భంగా ఏఐజీ హాస్పిటల్‌లో గురువారం వాకి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి విద్యార్థుల అంకితభావాన్ని కొనియాడారు. వైద్య నిపుణులు వృత్తి పవిత్రతను కాపాడాలని, శ్రేష్ఠత కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులను సన్మానించారు. స్నాతకోత్సవంలో ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, బుఖారా స్టేట్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు, ఉజ్బెకిస్థాన్ రాయబార కార్యాలయ సభ్యులు పాల్గొన్నారు.