20-03-2025 11:51:10 PM
అదుపులోకి తీసుకున్న పోలీసులు..
అమెరికా నుంచి పంపే యోచనలో సర్కారు.!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. వాషింగ్టన్‌లోని జార్జిటౌన్ యూనివర్సిటీలో రీసెర్చ్‌గా ఉన్న బదర్ ఖాన్ సూరినిఫెడరల్ ఏజెంట్లు కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి వర్జీనియాలోని ఆయన నివాస ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్‌కు చెందిన సూరి అమెరికా వ్యక్తినే వివాహం చేసుకున్నట్లు ఆయన తరఫు లాయర్ పేర్కొన్నారు.
హమాస్ ప్రచారం..
రీసెర్చర్‌గా ఉన్న సూరి హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాప్లిన్ వెల్లడించారు. కేవలం ప్రచారం చేయడం మాత్రమే కాకుండా ఆ సంస్థలోని ఓ వ్యక్తితో సూరికి సన్నిహిత సంబంధాలున్నట్లు కూడా ఆరోపించారు. అయితే తన అరెస్టుపై సూరి ఇమిగ్రేషన్ కోర్టులో పిటిషన్ వేశారు. తనకు ఏ పాపం తెలియదని, తన భార్యకు పాలస్తీనా మూలాలు ఉండటం వల్లే అరెస్టు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇక జార్జ్ టౌన్ యూనివర్సిటీ స్పందిస్తూ.. ‘సూరి రీసెర్చర్‌గా ఉన్నారు. అరెస్టుకు గల కారణం ఏంటనేది మాకు సరిగ్గా తెలియదు. ఈ కేసులో ఎటువంటి విషయమైనా తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాం. కోర్టు న్యాయబద్ధమైన తీర్పునిస్తుందని నమ్మకంతో ఉన్నాం’ అని పేర్కొంది. బదర్ ఖాన్ సూరి 2020లో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆయన సతీమణి గాజాకు చెందిన మహిళ అయినా ఆమెకు అమెరికా పౌరసత్వం ఉంది.