నాఫిత్రోమైసిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఔషధాలను తట్టుకునే ఇన్ఫెక్షన్లను నిరోధించేందుకు భారత్ మొదటి స్వదేశీ యాంటీబయాటిక్‌ను విడుదల చేసింది. నాఫిత్రోమైసిన్ అనే పేరుతో పిలిచే ఈ ఔషధాన్ని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఏసీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ ‘వోక్‌ర్‌డీటీ’ ద్వారా మిక్నాఫ్ బ్రాండ్ పేరుతో ఈ యాంటీబయాటిక్ త్వరలో అందుబాటులోకి రానుంది.
ఈ ఔషధం పెద్దవారిలో కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియల్ న్యుమోనియా (సీఏబీపీ) చికిత్సలో సంజీవనిగా మారనుంది. ఏటా సీఏబీపీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలమందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో భారత్‌లోనే 23 శాతం మంది ఉండటం గమనార్హం. నిశబ్ద మహమ్మారిగా పేరొందిన యాంటిమైక్రోబయల్ రెసిస్టెంట్ (ఏఎంఆర్)ను ఎదుర్కోవడంలో యాంటీబయాటిక్, యాంటీఫంగల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈ ఔషధం కీలక పాత్ర పోషించనుంది.