న్యూఢిల్లీ, జనవరి 25: పాకిస్థాన్ కారాగారంలో శిక్షా కాలం పూర్తయినప్పటికీ, అధికారులు భారత జాలరిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఆ ఖైదీ జైలులోనే ప్రాణాలు కోల్పోయాడు. పాకిస్థాన్ అధికారులు 2022లో ఓ కేసులో భారత జాలరి బాబును అరెస్ట్ చేశారు. కోర్టు తీర్పు మేరకు బాబు అప్పటి నుంచి కరాచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇటీవల బాబు శిక్షాకాలం పూర్తయినప్పటికీ, అక్కడి యంత్రాంగం విడుదల చేయలేదు. ఈ నెల 23న బాబు జైలులోనే మృతిచెందాడు. బాబు మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. పాకిస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తూ రెండేళ్లలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతిచెందారు.
ప్రస్తుతం అక్కడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 180 మంది మత్స్యకారుల శిక్షాకాలం పూర్తయినప్పటికీ, పాకిస్థాన్ వారిని విడుదల చేయడం లేదు. అందుకు పాక్ ప్రభుత్వం ఎన్నో సాకులు చెప్తూ వస్తున్నది. మత్స్యకారులను విడుదల చేయాలని భారత ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ పెద్దగా పురోగతి కనిపించడం లేదు.