హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం వాకథాన్ నిర్వహించింది. జూలై 13వ తేదీ నుంచి ఆగస్టు 13 వరకు సీఏ/ఎస్‌బీ/ఆర్టీడీలో రిటైల్ డిపాజిట్లపై ప్రత్యేక దృష్టిసారించి డిపాజిట్ల సమీకరణ కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ సమీపంలో ఫ్లకార్డులను ప్రదర్శించి, కరపత్రాలు పంపిణీ చేశారు. 1907 ఆగస్టు 15న ఇండియన్ బ్యాంక్ ప్రారంభమైందని, ఈ ఏడాదితో 118వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. రిటైల్ డిపాజిట్ ఉత్పత్తులను పెంపొందించుకొని సంస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. చీఫ్ జనరల్ మేనేజర్ సుధాకరరావు, హైదరాబాద్ ఎఫ్‌జీఎమ్ జీ రాజేశ్వరరెడ్డి, జోనల్ మేనేజర్ ఎస్ శ్రీనివాస్‌రావుతో పాటు ఇతర అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.