calender_icon.png 22 October, 2024 | 11:18 PM

రూ.10 నాణేలపై ఇండియన్ బ్యాంక్ అవగాహనా కార్యక్రమం

22-10-2024 01:16:33 AM

హైదరాబాద్, అక్టోబర్ 21: రూ.10 నాణేలను వినియోగించాలంటూ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నిర్వహించింది. కరెన్సీ నోట్ల బదులు నాణేల వినియోగం మరింత సానుకూలంగా ఉంటుందని, అవి దీర్ఘకాలం చెక్కుచెదరకుండా ఉంటాయని, పర్యావరణ రక్షణకు దోహదపడతాయన్న అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించామని ఇండియన్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్ హిమయత్‌నగర్ శాఖలో సోమవారం ఎఫ్‌జీఎం జి రాజేశ్వర రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ రూ.10 నాణేలు చట్టబద్దంగా చెల్లుబాటు అవుతాయని, వాటిని వినియోగించాలంటూ ఖాతాదారులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అక్టోబర్ 21, 22 తేదీల్లో తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లోని తమ 480 శాఖల ద్వారా శాఖల వద్ద, బహిరంగ ప్రాంతాల్లో, రైతు బజార్‌ల్లో ఈ కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ తన ఖాతాదారులకు, ప్రజలకు, వ్యాపారులకు రూ.10 నాణేలను పంపిణీ చేస్తూ వాటిని తీసుకోవాలంటూ దుకాణాలు, వీధి వ్యాపారులను కోరుతున్నది. రూ.2 కోట్ల విలువైన దాదాపు 20 లక్షల రూ.10 నాణేలను తమ బ్యాంక్ శాఖల ద్వారా చెలామణీలో పెట్టనున్నట్లు ఇండియన్ బ్యాంక్ తెలిపింది. 

బీఓఎం అధ్వర్యంలో...

రూ.10 నాణేల పట్ల ప్రజలకు అవగాహనా కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) కూడా సోమ, మంగళవారాల్లో చేపట్టింది.