న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని బందిపూర్ జిల్లా(Bandipora district)లో ఆర్మీ ట్రక్కు అదుపు తప్పి కొండపై నుంచి బోల్తా పడడంతో ఇద్దరు సైనికులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని ఎస్‌కే పాయెన్ సమీపంలో డ్రైవర్ ట్రక్కుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసు కుంది. గాయపడిన స్థితిలో ముగ్గురిని జిల్లా ఆసుపత్రికి తరలించగా ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మస్రత్ ఇక్బాల్ విలేకరులతో అన్నారు. ప్రమాద స్థలంలో భద్రతా బలగాలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. యూనియన్ టెరిటరీలో ఆర్మీ వాహనం ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు.
డిసెంబర్ 24, 2024న, పూంచ్ జిల్లా(Poonch District)లో ఆర్మీ వాహనం అదుపుతప్పి 350 అడుగుల లోతైన లోయలో పడటంతో ఐదుగురు సైనికులు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని ఆర్మీ తేల్చి చెప్పింది. నవంబర్ 4, 2024 న, రాజౌరి జిల్లాలో వారి వాహనం రోడ్డు నుండి స్కిడ్ అయి ఒక లోయలో పడటంతో ఒక ఆర్మీ సిబ్బంది మరణించారు. మరొకరు గాయపడ్డారు. నవంబర్ 2, 2024 న రియాసి జిల్లాలో వారి కారు కొండ రహదారి నుండి జారిపడి లోతైన లోయలో పడటంతో ఒక మహిళ ఆమె 10 నెలల కొడుకుతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.