హాయ్ ఫ్రెండ్స్.. చిన్నవయసులోనే పెద్ద పెద్ద విజయాలు సాధిస్తూ యంగెస్ట్ సీవోలుగా పేరుతెచ్చుకున్న బ్రదర్స్ గురించి ఈ ఆటాపాటాలో తెలుసుకుందాం. చెన్నైకి చెందిన శ్రావణ్, సంజయ్ బ్రదర్స్ ‘పిట్ట కొంచె.. కూత ఘనం’ అనే మాటలను నిజం చేశారు.
’గో డైమెన్షన్స్’ పేరుతో సొంతంగా మొబైల్ అప్లికేషన్స్ సంస్థను ప్రారంభించి మంచి పేరు సంపాదించుకున్నారు. 12, 10 ఏళ్ల వయసున్న శ్రవణ్ గో డైమెన్షన్స్ సహ వ్యవస్థాపకుడు కాగా, ఆయన సోదరుడు సహ వ్యవస్థాపకుడు, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
చెన్నై పాఠశాలలో ఎనిమిదో తరగతి, ఆరో తరగతి చదువుతున్న ఈ సోదరులు మనదేశంలో అతి పిన్న వయస్కులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు. ఒక కంపెనీకి అతి పిన్న వయస్కులైన ప్రమోటర్లు కూడా. వారి తండ్రి కుమారన్ సురేంద్రన్ వల్ల శ్రావణ్, సంజయ్‌లకు సాంకేతిక విషయాలపై ఆసక్తి పెరిగింది.
‘ ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు ఎలా పనిచేస్తాయి?’ టెక్నాలజీ పరంగా ఏం జరుగుతుంది? లాంటి విషయాలను తండ్రి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. టెక్నాలజీకి సంబంధించిన విషయాలను చందమామ కథల్లాగా ఆసక్తిగా వినేవారు. ఏ మాత్రం సమయం దొరికిన కంప్యూటర్‌లో రకరకాల కొత్త విషయాల గురించి తెలుసుకునేవారు. అలా ఎన్నో యాప్స్ గురించి తెలుసుకున్నారు.
కొత్త కొత్త యాప్స్ గురించి తెలుసుకునేటప్పుడు తమకు కూడా యాప్ తయారు చేయాలనిపించింది. ‘క్యాచ్ మీ కాప్’ పేరుతో ఈ బ్రదర్స్ రూపొందించిన యాప్‌కు మంచి పేరు వచ్చింది. ఇది పిల్లల ఆటలకు సంబంధించిన యాప్. అలాగే ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్, ఎమర్జెన్సీ సర్వీస్ యాప్, ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్.. ఇలా 150 యాప్స్ క్రియేట్ చేశారు.
పేరు తెచ్చిన యాప్స్
క్యాచ్ మీ పోలీస్
ఇది ఐఫోన్, ఐప్యాడ్‌లో లభించే గేమ్ యాప్. ఇదొక ఇంట్రెస్టింగ్ గేమ్. ఓ గజదొంగ జైలు నుంచి తప్పించుకుంటాడు. పోలీసులు అతని కోసం దేశవ్యాప్తంగా గాలిస్తుంటారు. అయితే పోలీసులకు ఎలా దొరుకుతాడు? ఎక్కడ పట్టుబడుతాడు? లాంటి సంఘటనలు పిల్లలకు ఆసక్తి కలిగిస్తాయి.
ఆల్ఫాబెట్స్ బోర్డు
ఇది ఐఫోన్, ఐప్యాడ్, ఆండ్రాయిడ్‌లలో లభ్యమయ్యే గేమ్ యాప్. పిల్లలు ఈ యాప్ ద్వారా అక్షరాలను ఆహ్లాదరకంగా నేర్చుకోవచ్చు. బోర్డుపై అక్షరాలు కనిపిస్తాయి. పిల్లలు అటూ ఇటూ తిరుగాడుతూ నేర్చుకోవచ్చు, సులువుగా అర్థం చేసుకునేందుకు బొమ్మలతో అక్షరాలను గుర్తిస్తారు.
కలర్ ప్యాలెట్
పిల్లలు రంగులు గుర్తించడానికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఐప్యాడ్ ఐఫోన్ లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. పిల్లలు అటూ ఇటూ వెళ్లి వాటి రంగులను నేర్చుకుని చివరికి వాటిపై పట్టు సాధిస్తారు. వాటి స్పెల్లింగ్ తోనే రంగులు కూడా నేర్పిస్తారు. ఫ్రెండ్స్ ఈ వారం ఈ బెస్ట్ బ్రదర్స్ గురించి తెలుసుకున్నాం కదా.. మీరు కూడా ఏదైనా కొత్తగా ట్రై చేసి మంచి పేరు తెచ్చుకోండి మరి.