- హసీనా అప్పగింతకు అంగీకరిస్తుంది
- కాకపోతే ఇండియాకు కొద్దిగా ఇబ్బంది తప్పదు
- బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు హుస్సేన్
న్యూఢిల్లీ, ఆగస్టు 31: భవిష్యత్తులో మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని హోంమంత్రిత్వ శాఖ లేదా న్యాయశాఖ అభ్యర్థన చేస్తే, అందుకు అనుగుణంగా భారత్ కట్టుబడి ఉంటుందని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు తాను తగిన వ్యక్తి కానప్పటికీ అలాంటి ప్రస్తావన వస్తే అది భారత ప్రభుత్వానికి అసౌకర్య పరిస్థితిని సృష్టించే అవకాశముందని హుస్సేన్ పేర్కొన్నారు. హసీనా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రభుత్వం ఆమెను తీసుకురావాలని భావిస్తే భారత్‌ను అడగాల్సి ఉంటుంది. అప్పుడు ఈ విషయంలో భారత్ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ.
కానీ భారత్ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుందని నేను నమ్ముతున్నా అని హుస్సేన్ తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య హసీనా అప్పగింత అంశం కీలకపాత్ర పోషిస్తుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. తమ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ అన్ని దేశాలతో సఖ్యతను కొనసాగించడమే తమ ప్రభుత్వ విధానమని వివరించారు. త్వరలోనే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశముందని, వాటిని నిష్పక్షపాతంగా నిర్వహించడమే ప్రస్తుతం తమ ముందున్న ప్రాథమిక లక్ష్యమని పేర్కొన్నారు. హసీనా ప్రస్తుతం 42 హత్యానేరాలతో పాటు మొత్తం 51 కేసులను ఎదుర్కొంటున్నారు.