24-04-2025 02:16:39 AM
ఘాతుకానికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌కు చేరుకున్న అమిత్ షా పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళి అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా తమ ఆప్తులను కోల్పోయిన వారు కన్నీటి పర్యంతమయ్యారు.
విహారయాత్ర కోసం వస్తే మా వాళ్లను పొట్టన పెట్టుకున్నారంటూ రోదించారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అమిత్ షా మృతులకు నివాళి అర్పిస్తున్న ఫోటోలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘భారమైన హృదయంతో పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి అంతిమ నివాళి అర్పిస్తున్నాం. భారత్ ఎన్నటికీ ఉగ్రవాదానికి తలొంచదు.
ఈ ఘాతుకానికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం. అంతకంతకు బదులు తీర్చుకుంటాం’ అని అమిత్ షా తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం బైసరన్ ప్రాంతంలో జరిగిన ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చిన ముష్కరులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 26 మంది మృతి చెందారు.