calender_icon.png 26 October, 2024 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

18-09-2024 12:05:32 AM

  1. 100 రోజుల్లో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న మోదీ ప్రభు త్వం.. వంద రోజుల కోసం నిర్దేశించుకున్న టార్గెట్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. చరిత్రలో సాధించలేని విజయాలను.. ప్రధాని మోదీ చొరవతో పదేళ్లలో సాధించామని చెప్పారు.

పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, ఎంపీలు డాక్టర్ కే లక్ష్మణ్, ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ 3.0 ప్రభుత్వం మొదటి వందరోజుల్లో.. వ్యవసాయం, మౌలిక వసతులు సహా వివిధ కీలక రంగాల్లో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని తెలిపారు. పేదలు, మధ్యతరగతి, వెనుకడిన వర్గాల జీవితాలను మరింత సరళంగా మార్చేందుకు పలు కీలక సంస్కరణలు తెచ్చామన్నారు. సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ.. వ్యాపారానుకూల వాతావరణంపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. 

పీఎం కిసాన్ నిధి రూ. 20వేల కోట్లు...

మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ తొలి నిర్ణయం పీఎం కిసాన్ నిధి 17వ వాయిదా కింద 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్లు విడుదల చేసినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను, వినూత్నఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ గ్రామీణ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలకు అండగా నిలిచేలా రూ.750 కోట్ల నిధితో ‘అగ్రిష్యూర్’ పథకాన్ని తెచ్చామని చెప్పారు. వాతావరణ మార్పులను రైతులకు తెలిపేలా రూ.2 వేల కోట్లతో ‘మిషన్ మౌసం’ ఏర్పాటు చేశామన్నామని వెల్లడించారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతుల కోసం ‘డిజిటల్ అగ్రికల్చర్ మిషన్’ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రపంచ తయారీ కేంద్రంగా దేశాన్ని రూపుదిద్దేందుకు రూ.28,600 కోట్లతో దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఇందులో ఒకటి జహీరాబాద్‌లో రాబోతోందని వివరించారు. రోడ్డు, రైలు, ఓడరేవులు, వైమానికమార్గాల కనెక్టివిటీని, ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడం కోసం రూ.3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాలలో 900 కి.మీ మేరకు రైల్ నెట్ వర్క్‌ను విస్తరించేలా రూ. 24,600 కోట్ల విలువైన 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులు ప్రారంభించామని వెల్లడించారు.  

నలంద విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం 

విద్యారంగంలో దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నలంద విశ్వవిద్యాలయానికి పునర్వుభైవం తీసుకొచ్చేలా కొత్త క్యాంపస్ ప్రారంభించుకున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. 70 ఏళ్లు, ఆపై వయసున్న అన్ని వర్గాలవారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించి.. ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ ఇవ్వనున్నామని చెప్పారు. దీని ద్వారా 6 కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం కలగనుందన్నారు. 

తెలంగాణ నుంచి అదనంగా మరో 10 లక్షల మంది దీని ద్వారా లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఖరీదైన మూడు కేన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించామని తెలిపారు. సైన్స్, టెక్నాలజీ రంగంలో సృజనాత్మకతకు పెద్దపీట వేసేలా.. రూ.10,600 కోట్లతో విజ్ఞాన్ ధారా పథకాన్ని ప్రారంభించామని వివరించారు. కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ చేసేందుకు ప్రత్యేకంగా రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల పెంపు కోసం, విదేశీ విద్యాసంస్థలపై ఆధారపడడాన్నితగ్గించడమే లక్ష్యంగా కొత్తగా 75,000 మెడికల్ సీట్లు తీసుకొచ్చామని అన్నారు. మహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై స్టాంప్ డ్యూటీ తక్కువ ఉండేలా రాష్ట్రాలను ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు. నారీ శక్తికి లబ్ది చేకూర్చే పథకాలకు ఈ ఏడాది బడ్జెట్ లో రూ. 3 లక్షల కోట్లు కేటాయించామన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా 3.5 లక్షల ఇళ్లల్లో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వంద రోజుల్లో నిర్దేశించుకున్న టార్గెను పూర్తి చేశామని... భవిష్యత్తులో మరింత వేగవంతంగా పనిచేస్తామని తెలిపారు.