27-02-2025 11:01:22 PM
ఘాటుగా స్పందించిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్థాన్ చేసిన ఆరోపణలపై భారత్ స్పందించింది. జెనీవాలో జరిగిన సమావేశంలో జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ న్యాయ మంత్రి అజం నజీర్ ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ భారత్ రాయబారి క్షితిజ్ త్యాగి గురువారం ధీటుగా స్పందించారు. మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలను హింసించడం సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని పాకిస్థాన్ మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదని ధ్వజమెత్తారు. పాక్ మాటల్లోనే కపటత్వం కనిపిస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి జాబితాలో ఉన్న పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తోందని దుమ్మెత్తిపోశారు. అయితే భారత్ మాత్రం ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవం కల్పించడంలో దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. మా దేశంపై ఆరోపణలు చేయడం మానేసి వారి దేశంలో ప్రజలకు సుపరిపాలన అందించడంపై దృష్టి సారిస్తే బాగుంటుందని క్షితిజ్ త్యాగి హితవు పలికారు. ఇటీవలే చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలోనూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్ జమ్మూ అంశాన్ని ప్రస్తావించారు. జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించే పాకిస్థాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడం హాస్యాస్పదమని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.