- ఈ శతాబ్దమంతా జనాభాలో భారతే టాప్
- ఆ తర్వాత పెరుగుదలలో 12 శాతం క్షీణత
- శతాబ్దం చివరి నాటికి చైనా జనాభా 63 కోట్లే
- సంతాన సాఫల్య రేటు పడిపోవడమే కారణం
జెనీవా (స్విట్జర్లాండ్), జూలై 12: ఇరవై ఒకటో శతాబ్దంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉంటుందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడింది. ప్రస్తుతం 145 కోట్లకుపైగా జనాభా ఉన్న భారత్.. 2060 నాటికి 170 కోట్లకు చేరుతుందని తెలిపింది. కానీ, ఆ తర్వాత 12 శాతం తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ పేరుతో యూఎన్ గురువారం ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే 50 నుంచి 60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1,030 కోట్లకు చేరుతుందని, శతాబ్దం చివరి నాటికి పెరుగుదల భారీగా క్షీణించి 1,020 కోట్లకు చేరుతుందని తెలిపింది.
పెరుగుతూ తగ్గుతూ..
గతేడాది చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. 2100 వరకు అదే హోదాను భారత్ కలిగి ఉంటుందని ఐరాస వెల్లడించింది. 2024లో భారత జనాభా 145 కోట్లుగా అంచనా వేసిన యూఎన్.. 2054 నాటికి 169 కోట్లకు చేరుతుందని పేర్కొంది. ఆ తర్వాత 150 కోట్లకు చేరుతుందని, మళ్లీ 2060 నాటికి 170 కోట్ల గరిష్ఠానికి ఎకబాకుతుందని అంచనా వేసింది. 70వ దశకం తర్వాత 12 శాతం తగ్గుదలతో క్రమంగా దిగొస్తుందని తెలిపింది.
చైనాకు రెండున్నర రెట్లు అధికం
ప్రస్తుతం 141 కోట్లుగా ఉన్న చైనా జనాభా 2054 నాటికి 121 కోట్లకు చేరుతుందని యూఎన్ నివేదిక తెలిపింది. 2100 నాటికి భారీగా క్షీణించి 63 కోట్లకు పడిపోతుందని అంచనా వేసింది. ఆ కాలంతో పోలిస్తే చైనా జనాభాకు భారత్ రెండున్నర రెట్లు అధికంగా ఉంటుంది. వచ్చే 30 ఏళ్లలో చైనా జనాభాలో భారీగా తగ్గుదల నమోదవుతుందని ఐరాస నివేదిక పేర్కొంది. జపాన్, రష్యా కూడా ఇదే దారిలో పయనిస్తున్నాయని తెలిపింది. 2054 వరకు చైనా 20 కోట్లు, జపాన్ 2 కోట్లు, రష్యాలో కోటి మంది జనాభా తగ్గుతుందని స్పష్టం చేసింది.
సంతాన రేటు క్షీణతే కారణం
ప్రస్తుతం ప్రపంచ జనాభా 820 కోట్లుగా ఉంది. దాదాపు 2080 నాటికి గరిష్ఠ స్థాయిలో ప్రపంచ జనాభా 1,030 కోట్లకు చేరనుంది. శతాబ్దం ముగిసే నాటికి ఈ సంఖ్య దిగొచ్చి 1,020 కోట్లకు పడిపోనుంది. ఇందుకు ప్రధాన కారణం సంతాన సాఫల్య రేటు గణనీయంగా పడిపోవడమేనని ఐరాస అంచనాకు వచ్చింది. చైనాలో ఒక మహిళ తన జీవితకాలంలో ఒకరికి మాత్రమే జన్మనిస్తున్నట్లు ఐరాస తెలిపింది. కానీ ప్రపంచ సగటు ప్రకారం సంతాన సాఫల్య రేటు 2.1గా ఉండాలని, అప్పుడే ప్రస్తుత జనాభా అలాగే కొనసాగుతుందని పేర్కొంది. ఈ రేటు 1.8 నుంచి 1.5 కన్నా దిగువకు పడిపోతే జనాభా గణనీయంగా పడిపోతుందని స్పష్టం చేసింది. అందువల్ల చైనా జనాభా భవిష్యత్తులో పెరగడం సాధ్యమని తెలిపింది.