calender_icon.png 9 January, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధి బాటలోనే భారత్

08-01-2025 12:00:00 AM

బ్రిక్‌వర్క్ రేటింగ్స్ అంచనా

హైదరాబాద్, జనవరి 7: బ్యాంకింగ్ రంగం ఆర్థిక స్థిరత్వం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం, వ్యూహాత్మక విధాన చర్యలు, పెట్టుబడుల సానుకూల వాతావరణం తదితరాలు  దేశ ఆర్థికాభివృద్ధికి దారితీస్తాయని, రానున్న ఏండ్లలో భారత్ వృద్ధి పటిష్టంగా ఉంటుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటింగ్స్ తాజా రీసెర్చ్ రిపోర్ట్‌లో అంచనా వేసింది.

అంతర్జాతీయ సవాళ్ల నడుమ ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ నిశ్చలంగా వృద్ధి సాధిస్తున్నదని, 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.6 శాతం వృద్ధి సాధిస్తుందన్న వివిధ ఏజెన్సీల అంచనాలు గత ఏండ్ల వృద్ధి బాటలోనే భారత్ నడుస్తున్నదడానికి సంకేతమని, ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ హోదాను నిలుపుకుంటున్నదని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ పేర్కొంది. భారత్ జీడీపీ వృద్ధి కారణంగా ప్రస్తుతం నాల్గవస్థానంలో ఉన్న జర్మనీ జీడీపీతో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించుకుంటున్నదని తెలిపింది. 

గణనీయమైన మెరుగుదల

2024లో తలసరి జీడీపీ రూ.2,00,000కు (2,336 డాలర్లు)  చేరిందని, 2012లో నమోదైన రూ.71,609తో (836.4 డాలర్లు) పోలిస్తే తలసరి జీడీపీ గణనీయంగా పెరిగిందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. ఉపాధికి డిమాండ్ పెరగడం, ఆర్థిక వ్యవస్థ విస్తరణ కార్యకలాపాలతో గత దశాబ్దకాలంలో భారీగా 175 శాతం వృద్ధిచెందిందని పేర్కొంది.

2024 డిసెంబర్‌లో రిజర్వ్‌బ్యాంక్ విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో బ్యాంకింగ్ రంగం, మొత్తం ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై పలు కీలక అంశాల్ని ప్రస్తావించిందని, అందులో ముఖ్యంగా స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 12 ఏండ్ల కనిష్ఠం 2.4 శాతానికి తగ్గడం గమనార్హమని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ వివరించింది. సమర్థవంతమైన రికవరీ చర్యలు, వ్యూహాత్మక రైటాఫ్‌లు, కొత్త మొండి బకాయిలు తక్కువగా నమోదుకావడం ఎన్‌పీఏలు తగ్గడానికి కారణమని పేర్కొంది.

అయితే డిసెంబర్ ద్వితీయార్థంలో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ కొరత రూ.2.43 లక్షల కోట్లకు పెరగడం కొంత సవాలేనని తెలిపింది. గత ఏడాది భారత్ వృద్ధిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కీలకపాత్ర పోషించాయని, 2000 నుంచి 2024 సంవత్సరం వరకూ మొత్తం ఎఫ్‌డీఐలు 1.03 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.